Monsoon Cultivation in Telangana : రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం వర్షాలు దంచికొడతాయనే వాతావరణ శాఖ తీపి కబురు చెప్పిన నేపథ్యంలో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. వరిని దాదాపు 65 లక్షల ఎకరాల్లోనూ, పత్తిని 60.53 లక్షల ఎకరాల్లోనూ సాగు చేస్తున్నారని భావిస్తున్నారు. ఇందుకు ఇప్పటి నుంచే వ్యవసాయ శాఖ వానాకాలం సీజన్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.
ఈ ప్రణాళికలో సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడిస్తున్న నేపథ్యంలో మొత్తం 1.50 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసే అవకాశం ఉందని గుర్తించింది. వ్యవసాయ శాఖ వానాకాల ప్రణాళికలో రాష్ట్రంలో ముందస్తు వాతావరణ పరిస్థితులు, మార్కెట్లలో లభించిన ధరలు, వాతావరణ పరిస్థితులు అంచనాల ప్రాతిపదికన తీసుకుంది.
పత్తి సాగు భేష్ : గత వానాకాలం సీజన్లో రాష్ట్రంలో వరి 64 లక్షల ఎకరాల్లోనూ, పత్తి 44.77 లక్షల ఎకరాల్లోనూ సాగైంది. యాసంగిలో మాత్రం వర్షాభావం, సాగునీరందక ఆశించిన మేర సాగు కాలేదనే చెప్పాలి. ఈసారి మంచి వర్షాలే ఉంటాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఈ రెండు పంటలు గత ఏడాది వానాకాలం సీజన్‌కు మించి సాగయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పత్తికి మంచి ధరలు రావడంతో అన్నదాతలు అటువైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే కొనుగోళ్లు సజావుగా సాగడంతో రైతులు నిరుటి కంటే ఎక్కువగా సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చింది.