Farmer Crop Loan Waiver Funds Credited in Farmers Accounts : అన్నదాత పండగ రానే వచ్చింది. ఎప్పటి నుంచో రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ ప్రక్రియ మొదలైంది. సచివాయలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మహాఘట్టం ప్రారంభ శుభ సమయాన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 577 రైతు వేదికల్లో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సభాపతి ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
రైతు పంట రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. గతంలో రుణమాఫీ అమలు చేస్తామని పదేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు.
"తొలి విడతలో రూ.లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ. తొలి విడత రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లు జమ చేస్తున్నాం. రైతుల అప్పులు రూ.2 లక్షల వరకు చెల్లించాలని హామీ ఇచ్చాం. డిసెంబరు 9న రైతుల రుణాల మాఫీకి కటాఫ్ పెట్టుకున్నాం. తెలంగాణ ప్రక్రియ ప్రారంభించిన రోజు డిసెంబరు 9. తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీ జన్మదినం డిసెంబరు 9. డిసెంబరు 9 అనేది మనందరికీ పండగ రోజు. అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.
మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు మాఫీ : రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, మూడు విడత్లో రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఆగస్టులోగా రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. రేషన్‌కార్డు ప్రామాణికంగా రుణమాఫీ చేస్తున్నట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీకి ప్రామాణికం పాస్ పుస్తకమే రేషన్ కార్డు కాదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రతి నెలా రూ.7 వేల కోట్లు మిత్తి చెల్లిస్తున్నామని తెలిపారు. జీతాలు, పింఛన్లు కోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. పథకాలకు ఏడు నెలల్లోనే రూ.29 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయం దండగ కాదు, పండగ అని నిరూపించామని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
"10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఐదేళ్లు అయినా నాలుగు విడతల్లో చేస్తామని అసలు మిత్తి చెల్లిస్తామని రైతులను తప్పుదోవ పట్టించి, మళ్లీ 2018లో కూడా అదే విధమైన లక్ష్యంతో ఎన్నికల్లో గెలిచి ఆ హామీని నేరవేర్చలేదు. మొదటి ఐదేళ్లలో గత ప్రభుత్వం చెల్లించింది రూ.12 వేల కోట్లు మాత్రమే. 2018-2023 వరకు చెల్లించాల్సిన రూ.16 వేల కోట్లలో కనీసం రూ.9వేల కోట్లను కూడా చెల్లించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో సోనియా గాంధీ ఇచ్చిన హామీ రూ.2 లక్షల రుణమాఫీ ప్రకారం మాఫీ చేస్తున్నాం. మూడు విడతల్లో రూ.31 వేల కోట్లను రుణమాఫీ చేస్తున్నాం. ఇందులో మొదటి విడతగా రూ.6098 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశాం. రైతుకు రుణ విముక్తి కల్గించాం."- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
గ్రామాల్లో సంబురాలు : 40 లక్షల బ్యాంకు ఖాతాల ద్వారా 31 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర. రాష్ట్రంలో రైతుల పంట రుణమాఫీ నేటి నుంచి మొదలైన దృష్ట్యా మూడు దశల్లో రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆరు గ్యారంటీల్లో భాగంగా నేడు మొదటి దశ కింద రూ.1 లక్ష వరకు అప్పులు మాఫీ చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 11,50,193 బ్యాంకు ఖాతాల్లో 10,83,004 కుటుంబాల లబ్ధిదారులకు 6098.93 కోట్ల రూపాయలు జమ చేయడంతో ఎక్కడ చూసిన రైతుల్లో హర్షతిరేకాలు వ్యక్తమవుతోన్నాయి. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. గ్రామాల్లో రైతు వేదికల వద్ద రైతులు మిఠాయిలు పంచుకున్నారు. నృత్యాలు చేసిన ఆనందోత్సాల్లో మునిగారు.
ఆ నిధులు రుణమాఫీకే వాడాలి - ఇతర అప్పులకు జమ చేయొద్దు: డిప్యూటీ సీఎం భట్టి - Telangana Loan Waiver Today
రైతున్నలు బాగుండాలని - పైసల్లేకపోయినా రుణమాఫీ చేస్తున్నం : పొంగులేటి - Farmer Loan Waiver in Telangana