Famous journalist N Ram Comments in Ramoji Rao Memorial Programme:రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం విజయవాడ శివారు కానూరు వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, పాత్రికేయ దిగ్గజాలు ఎన్. రామ్, శేఖర్ గుప్తా తదితరులు హాజరయ్యారు.
రామోజీరావు ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిచయం అయ్యారని ప్రముఖ పాత్రికేయుడు, హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్.రామ్ తెలిపారు. అప్పటి నుంచి ఆయనతో వ్యక్తిగత పరిచయం పెరిగిందని అన్నారు. రామోజీరావు ఇన్వెస్టిగేషన్ జర్నలిజాన్ని నమ్మేవారని అన్నారు. నమ్మిన విలువల కోసం కట్టుబడేవారని తెలిపారు. అప్పట్లో దేశ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉండేవని ఆ సమయంలో పాత్రికేయుల హక్కులపై రామోజీరావు పోరాడారని ఎన్. రామ్ అన్నారు. అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పరువు నష్టం బిల్లు తెచ్చిందని ఆ బిల్లులో పాత్రికేయులే లక్ష్యంగా కఠిన నిబంధనలు రూపొందించారని తెలిపారు.
విశ్వసనీయతే అసలైన సంపదగా - దార్శనికుడు రామోజీరావు విశ్వాసాలు - Ramoji Rao Quotations in Telugu
ఆ పరువు నష్టం బిల్లుపై ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా రామోజీ పోరాడారని ఎన్. రామ్ వ్యాఖ్యానించారు. రామోజీరావు పోరాటం ఫలితంగా ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఈనాడు పత్రిక సమాజంలోని క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టిందని అన్నారు. ఈనాడు ప్రస్థానంపై ఆస్ట్రేలియన్ రాజకీయవేత్త రాబిన్ జెఫ్రీ ఓ పుస్తకమే రాశారని తెలిపారు. జిల్లా పేజీల గొప్పదనం గురించి రాబిన్ జెఫ్రీ ప్రత్యేకంగా రాశారని గుర్తు చేశారు. ఈనాడు తర్వాత టీవీ రంగంలోనూ రామోజీ అడుగుపెట్టి తనదైన విజయం సాధించారని ఎన్.రామ్ అన్నారు.