Fake Police Cheat Software Engineer :ఐసీసీసీలో టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు నమ్మించి ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ వద్ద రూ.2.80 లక్షలకు పైగా మోసం చేసిన సంఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరిగింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. మే 2024లో తన స్నేహితులతో కలిసి ఐసీసీసీ భవనం ముందున్న నిలోఫర్ హోటల్‌లో కూర్చుని వ్యాపారాన్ని ప్రారంభించే విషయమై చర్చిస్తున్నారు. అదే సమయంలో వారి పక్కన కూర్చున్న హరిజన గోవర్ధన్ అనే వ్యక్తి వారి మాటలు విన్నాడు. వారు ముగ్గురు వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ ఉండగా, వారి వద్దకు వచ్చాడు. తాను ఐసీసీసీ టాస్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు.
తనకు పెద్దవాళ్లతో సంబంధాలు ఉన్నాయని, వ్యాపార ప్రారంభోత్సవానికి అవసరమైన సాయం చేస్తానని హరిజన గోవర్ధన్ నమ్మించాడు. దీంతో అతడి మాటలు విన్న సాఫ్ట్‌వేర్ అంతా నిజమేనేమోనని నమ్మాడు. దీంతో వారిద్దరూ తమ సెల్‌ఫోన్ నంబర్లను మార్చుకున్నారు. కొన్ని రోజుల తరవాత ఫోన్ చేసి గోవర్ధన్ ఐసీసీసీ భవనం సమీపంలో కలుద్దామని చెప్పాడు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన కారులో అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో ఐసీసీసీ భవనం నుంచి వచ్చిన గోవర్ధన్ కారులో కూర్చొని వ్యాపారం గురించి చర్చించాడు.