Fake Podu Pass Books Issue Warangal : మీకు తెలుసా? పది వేల రూపాయలు ముట్టజెప్పితే ఎకరం భూమి హక్కు పత్రం ఇస్తారు. మరో రూ.10 వేలు ఇస్తే బ్యాంకులో పంట లోన్ ఇప్పిస్తారు. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజమండి. అసలెక్కడ ఈ దందా జరుగుతోంది? దీనివెనకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
ఇది జరిగింది ఎక్కడో కాదండోయ్! వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో. ఇక్కడ దళారులు అటవీ భూములకు అటవీ హక్కు పత్రాల(పట్టా పుస్తకాల) పేరుతో నడిపిస్తున్న నయా దందా ఇది. అటవీ, మారుమూల గ్రామాల రైతులకు మాయమాటలు చెప్పి అరచేతిలో స్వర్గం చూపించి నకిలీ పోడు పట్టాదారు పుస్తకాలను అంటగట్టి రెండు చేతులా దండుకుంటున్నారు. ఈ ఫేక్ పుస్తకాలు చెలామణి బహిరంగంగానే సాగుతున్నప్పటికీ సంబంధిత ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే : గతేడాది పోడు భూములు సాగు చేసిన గిరిజన తెగకు చెందిన కోయ, లంబాడ, నాయకపోడు, ఎరుకల సామాజిక వర్గాల వారికి ప్రభుత్వం సర్వే చేసి పట్టాదారు పుస్తకం( అటవీ హక్కు పత్రాలు) జారీ చేసింది. దీన్నే అవకాశంగా తీసుకుని సులువుగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ అటవీ హక్కు పత్రాల తయారీకి శ్రీకారం చుట్టాడు ఓ దళారి. సదరు దళారీ గ్రామాల్లోకి వెళ్లి తనకు రూ.10 వేలు ఇస్తే ఎకరం భూమి పోడు పట్టాదారు పాస్బుక్ ఇస్తానని నమ్మబలికాడు.
ముందుగా ఒకరిద్దరికి ఇవ్వడంతో నమ్మి చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు 3, 4 ఎకరాలకు నగదు ముట్టజెప్పి పుస్తకాలు పొందారు. ఓ అటవీ గ్రామంలో గిరిజనేతరులైన రైతులకు కూడా నకిలీ పోడు పట్టాలు ఇవ్వడం కొసమెరుపు. నల్లబెల్లి మండలంలో ఐదు గ్రామాలు, నర్సంపేట మండలంలో 3 గ్రామాల్లో ఈ నకిలీ పోడు పట్టా పుస్తకాలు జోరుగా చెలామణి అయ్యాయి. గత యాసంగి సీజన్‌లో నర్సంపేటలోని ఓ బ్యాంకు నుంచి వారు పంట లోన్లు కూడా పొందడం విశేషం.