ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘాటెక్కిన గుంటూరు రాజకీయాలు - చంద్రబాబు నిర్ణయం కోసం ఆశావహుల ఎదురుచూపులు - గుంటూరు టీడీపీ అభ్యర్థుల వివరాలు

TDP MLA, MP Candidates Finalization: గుంటూరు రాజకీయం మరింత ఘాటెక్కకుండా నిర్ణయం తీసుకునేలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలుతో పాటు సీనియర్ నేతలతోనూ సమావేశమై రేసు గుర్రాల ఎంపిక కొలిక్కి తేచ్చేందుకు కృషి చేస్తున్నారు. అభ్యర్థుల కసరత్తు నేపథ్యంలో కీలకమైన నరసరావుపేట, గురజాల, పెదకూరపాడు స్థానాలకు అభ్యర్ధులెవరనే సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Excitement continues in Guntur
Excitement continues in Guntur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 10:26 PM IST

TDP MLA, MP Candidates Finalization:ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ఉన్న మొత్తం 17 అసెంబ్లీ స్థానాల్లో 12 అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులను తొలి జాబితాలో తెలుగుదేశం, జనసేన ప్రకటించేశాయి. మిగిలిన 5 స్థానాల్లో అభ్యర్ధులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, నరసరావు పేట పార్లమెంట్​ల పరిధిలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా, బాపట్ల పార్లమెంట్ పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలున్నాయి. కీలకమైన నరసరావుపేట, గురజాల, పెదకూరపాడు స్థానాలకు అభ్యర్ధులెవ్వరన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఎంపీగా పోటీ చేయనున్న లావు:నరసరావుపేట సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి త్వరలోనే సైకిలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఎంపీగా పోటీ చేయనుండటం దాదాపు ఖరారయ్యింది. జంగా కృష్ణమూర్తి చేరికను స్వాగతించిన అధినేత, ఆయనకు తగు న్యాయం చేయాలని భావిస్తున్నారు. అభ్యర్ధులను ఇంకా ప్రకటించాల్సి ఉన్న పెదకూరపాడుకు కొమ్మాలపాటి శ్రీధర్‌ తెలుగుదేశం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే ఆ స్థానం టికెట్‌ దక్కించుకునేందుకు బాష్యం ప్రవీణ్‌ రేసులోకి వచ్చారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఒకరికి సీటు కేటాయించే కసరత్తు ముమ్మరంగా సాగుతోంది.

రెండు స్థానాల్లో నలుగురి పోటీ: నరసరావు పేట అసెంబ్లీ స్థానానికి అరవిందబాబు ఇంచార్జ్‌గా ఉన్నారు. అయితే ఆ స్థానానికి నల్లపాటి రాము టికెట్‌ ఆశిస్తున్నారు. నరసరావుపేటకు చెంతనే ఉన్న గురజాలకు మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు ఇంచార్జ్‌గా ఉన్నారు. లావు శ్రీకృష్ణ దేవరాయలుతో పాటు తెలుగుదేశంలో చేరనున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురజాల నియోజకవర్గ స్థానికుడు కావడంతో ఆయన అక్కడి నుంచే పోటీ చేయడానికి సుముఖత చూపుతున్నారు. నరసరావుపేట, గురజాల స్థానాలకు పోటీలో ఉన్న ఆశావహులు నల్లపాటి రాము, యరపతినేని శ్రీనివాసరావు, జంగా కృష్ణమూర్తి, అరవిందబాబులలో ఇద్దరిని నరసరావుపేట, గురజాల స్థానాల్లో నిలబెట్టే కసరత్తు సాగుతోంది. జంగా కృష్ణమూర్తిపై ఒకరోజు గురజాల స్థానంలో, మరోరోజు నరసరావుపేట స్థానంలో అభిప్రాయ సేకరణ జరిగింది.

అభిప్రాయ సేకరణ: యరపతినేని శ్రీనివాసరావుపై కూడా ఒకరోజు గురజాల స్థానంలో మరోరోజు నరసరావుపేట స్థానంలో అభిప్రాయ సేకరణ జరిగింది. మిగిలిన ఆశావహులపైనా అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తగు నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. ఉన్న నలుగురు ఆశావహుల్లో ఇద్దరి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చి మరో ఇద్దరిని నరసరావుపేట, గురజాల అసెంబ్లీ స్థానాల బరిలో దింపనున్నారు. నరసరావు పేట పార్లమెంట్‌ పరిధిలోని వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్లకు అభ్యర్ధులుగా జీవి ఆంజనేయులు, పత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, బ్రహ్మానందరెడ్డిలను అభ్యర్ధులుగా తొలి జాబితాలో ఖరారు చేశారు.

ముస్లిం మైనార్టీ నే నిలబెట్టాలా: గుంటూరు పార్లమెంట్‌ స్థానం విషయానికొస్తే సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌ రాజకీయాలకు విరామం ప్రకటించడంతో ఈ సారి పెమ్మసాని చంద్రశేఖర్‌ ను తెలుగుదేశం అభ్యర్ధిగా బరిలోకి దింపడం దాదాపు ఖరారయ్యింది. ఇక గుంటూరు నగర పరిధిలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులు ఇంకా తేలకపోవడం, ఆశావహులు ఎక్కువగా ఉండడం ఉత్కంఠ రేపుతోంది. గుంటూరు 1 స్థానానికి ముస్లిం మైనార్టీ నేత నజీర్‌ అహ్మద్‌ ఇంచార్జ్‌గా ఉన్నారు. అటు వైఎస్సార్సీపీ నుంచి కూడా ముస్లిం మైనార్టీ అభ్యర్ధి పోటీలో ఉండడంతో ఇతర కులసమీకరణాలు ఎమైనా పని చేస్తాయా లేక ముస్లిం మైనార్టీనే నిలబెట్టాలా అనే అధ్యయనం పార్టీ అధిష్టానం చేస్తోంది.

ఉత్కంఠ వీడేనా - ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఎవరు?

మద్దాలి గిరికి షాకిచ్చిన వైఎస్సార్సీపీ: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు 2 స్థానానికి గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలిచిన మద్దాలి గిరి వైఎస్సార్సీపీ పంచన చేరారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిన మద్దాలి గిరికి షాకిచ్చిన వైఎస్సార్సీపీ మంత్రి విడదల రజనిని గుంటూరు 2 స్థానం నుంచి పోటీలో నిలబెట్టింది. తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న కోవెలమూడి రవీంద్ర టికెట్‌ ఆశిస్తుండగా వైద్యుడు శేషయ్య, డేగల ప్రభాకర్, వికాస్‌ ఆసుపత్రి డైరెక్టర్‌, బీసి మహిళా నేత గల్లా మాధవి, మన్నవ మోహన్ కృష్ణ తదితరులు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే స్థానానికి పొత్తులో తెనాలి టికెట్‌ కోల్పోయినందున గుంటూరు 2 అయినా తనకు కేటాయించాలంటూ ఆలపాటి రాజా ప్రయత్నిస్తున్నారు. ఇంత మందిలో ఎవరిని చంద్రబాబు ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

టికెట్ కోసం దళిత నేతల పోటీ: బాపట్ల పార్లమెంట్‌ ఎస్సీ రిజర్వ్ కావటంతో ఇక్కడ తెలుగుదేశం తరఫున పోటీ చేసేందుకు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాద్, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు తదితరులు పోటీ పడుతున్నారు. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న రేపల్లె, వేమూరు, బాపట్ల అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులుగా అనగాని సత్యప్రసాద్‌, నక్కా ఆనంద్‌ బాబు, వేగేశ్న వర్మలను అభ్యర్ధులుగా ఇప్పటికే ప్రకటించేశారు.

టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: తంగిరాల సౌమ్య

ABOUT THE AUTHOR

...view details