Niranjan reddy on Krishna Water :ఓ వైపు పాలమూరు రైతాంగం నీటి కోసం ఎదురు చూస్తుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన, చిత్తశుద్ధి లేక బంగారం లాంటి కృష్ణా జలాలను బంగాళాఖాతంలోకి వదిలిపెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన రెడ్డి అన్నారు. కృష్ణా జలాలు సగటున రోజుకు 30 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆయన తెలిపారు.
ప్రాజెక్టు సిద్ధం : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల వ్యవస్థ పూర్తిగా సిద్ధమైందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. నార్లాపూర్ నుంచి ఏదుల మీదుగా వట్టెం వరకు 27 టీఎంసీల వరకు నీరు ఒడిసిపట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా కేసీఆర్ చేసిన ప్రాజెక్టు అని నీరు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంది కాబట్టే పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు- రంగారెడ్డి పనులను వేగవంతం చేశారని తెలిపారు.
రాజకీయ కక్ష : కరివెన నుంచి నీరు ముందుకు పోయేలా కాల్వల కోసం టెండర్లు పిలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. కల్వకుర్తి పంపులు కూడా ఉపయోగించి నార్లాపూర్‌లో ఏడు టీఎంసీల నీరు నింపితే మంచినీటికి కూడా ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. నీటిపారుదలశాఖ మంత్రి, స్థానిక మంత్రి ఒక్కరోజు కూడా ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులు పర్యవేక్షించలేదన్న ఆయన, రాజకీయ కక్షతో రైతులను ప్రభుత్వం ఆగం చేస్తోందని అన్నారు.