EX Minister KTR ACB Inquiry :ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు దూకుడు కొనసాగిస్తున్నాయి. ఈడీ, ఏసీబీ ఈ కేసులో విచారణ ముమ్మరం చేశాయి. సోమవారం నుంచి నిందితులను రెండు దర్యాప్తు సంస్థలు వరుసగా 5 రోజులు విచారణ చేయనుండటం ఆసక్తి రేపుతోంది. ఏసీబీ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిని విచారణకు హాజరు కావాలని ఈ నెల 3న నోటీసు జారీ చేసింది. మూడు రోజుల వ్యవధితోనే విచారణకు పిలవడంతో ఆయన హాజరవుతారా, సమయం కోరతారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే విచారణకు వచ్చేందుకే కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ ముందు విచారణకు సోమవారం మాజీ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఆయనకు మూడు రోజుల కిందటే విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసులు అందజేసింది. ఈ కేసులో నిధుల బదలాయింపులో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీలోని సీఐయు విచారణ బృందం కేటీఆర్‌ను ప్రశ్నించనుంది. మరోవైపు కేటీఆర్ ఈ నెల 7న విచారణకు హాజరు కావాలని ఈడీ అంతకుముందే కేటీఆర్‌కు సమన్లు ఇచ్చింది.
ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ 8న హెచ్ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డా 10న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు బీఎల్ఎన్ రెడ్డిని ఇదే నెల 8న, అర్వింద్ కుమార్ 9న ఈడీ విచారించనుంది. ఇలా రెండు దర్యాప్తు సంస్థలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రేపుతోంది. ఆది నుంచే ఈ వ్యవహారంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఫార్ములా ఈ రేస్ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటా - ఈ ఏడాది ఉప ఎన్నికలు రావచ్చు: కేటీఆర్
24 గంటల్లోనే రంగంలోని ఈడీ :గత నెల 19న తొలుత ఏసీబీ ఎఫ్ఎఐఆర్ నమోదు చేసిన వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా మరుసటి రోజే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయడంపై ఆసక్తికర చర్చ జరిగింది. సాధారణంగా ఏదైనా దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం ఆ కేసులో మనీలాండరింగ్, ఫారిన్ ఎక్చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉంటేనే ఈడీ దర్యాప్తు చేపడుతుంది. కానీ పార్ములా ఈ రేస్ కేసులో మాత్రం ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగింది. అంతేకాకుండా కేటీఆర్‌ను ఈనెల 7న విచారణకు రావాలని గతనెల 28నే ఈడీ సమన్లు జారీ చేయగా అంతకు ఒకరోజు ముందే తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఈనెల 3న నోటీస్ ఇవ్వడంతో అసలు ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.