ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్‌ జమానాలోని అక్రమార్కులపై చర్యల్లో వేగం ఏది? - YS JAGAN WARNS TO POLICE

‘సోషల్‌ సైకో’లు పారిపోతున్నా పట్టుకోరా? - ప్రశ్నార్థకంగా అధికార యంత్రాంగం తీరు

YS Jagan Warning to Police
YS Jagan Warning to Police (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2024, 12:12 PM IST

YS Jagan Warns to Police :యంత్రాంగంలో చిన్న కదలిక వచ్చి సోషల్‌ మీడియా సైకోలపై చర్యలకు ఉపక్రమించగానే మాజీ ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగంగా బెదిరింపులకు దిగారు. నాలుగు సంవత్సరాల తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని, తమ వాళ్లపై చర్యలు తీసుకున్న అధికారుల అంతు చూస్తామన్నారు. ఆయన అంతగా రెచ్చిపోవడానికి యంత్రాంగం మెతక వైఖరే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తీవ్రమైన ఆరోపణలుంటాయి - ఫిర్యాదులుంటాయి - వాటికి ఆధారాలూ ఉంటాయి - కానీ చర్యలుండవు! అడపాదడపా చర్యలకు ఉపక్రమించినా వేగం ఉండదు. ఒకరిద్దరు అధికారులు చొరవ చూపించి స్పందించినా, అర్థవంతమైన ముగింపు ఉండదు! ఇదీ అక్రమార్కులపై ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న ధోరణి. వైఎస్సార్సీపీ హయాంలో తీవ్ర అరాచకాలకు, అవినీతికి పాల్పడ్డ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, అసత్యాలు, అసభ్య పోస్టులతో చెలరేగిపోతున్న సామాజిక మాధ్యమాల సైకోల ఆటకట్టించడంలో యంత్రాంగంలో వేగం లోపించింది.

తప్పు చేసినవాళ్లు కళ్లముందే తిరుగుతున్నా, మమ్మల్నెవరూ, ఏమీ చేయలేరన్నట్టు సవాళ్లు విసురుతున్నా అధికార యంత్రాంగం విపరీతమైన సంయమనం పాటిస్తోంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అడపాదడపా కేసులు పెట్టి, వదిలేస్తోంది. నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టి, విచారించి, అరెస్ట్ చేసేందుకు ఉన్నతాధికారుల వద్ద స్పష్టమైన ప్రణాళిక, సీరియస్‌నెస్‌ ఉన్నట్లు కనిపించడం లేదు. జగన్‌ జమానాలో పేట్రేగిపోయినవాళ్లంతా సర్కార్ మారిన తొలినాళ్లలో భయంతో సుప్తావస్థలోకి వెళ్లారు. యంత్రాంగంలోని ఉదాసీనతను పసిగట్టి మళ్లీ బయటకొచ్చి చెలరేగిపోతున్నారు.

కలుగులో దాగినా పట్టుకొస్తామన్నారే! : అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాజధాని పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్‌పై వైఎస్సార్సీపీ ప్రేరేపిత మూకలు రాళ్లు, చెప్పులు విసిరాయి. నాటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దాన్ని భావప్రకటన స్వేచ్ఛగా అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలు నాటి ప్రతిపక్షాలపై వైఎస్సార్సీపీ మూకల అరాచకాలకు రాచబాటలు పరిచాయి. తాము అధికారంలోకి వచ్చాక సవాంగ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో దాక్కున్నా లాక్కొచ్చి కేసులు పెడతామని టీడీపీ నాయకులు ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక, సవాంగ్‌ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసి, బయటపడ్డారు. ఆయనపై ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలూ లేవు.

బెయిల్‌కు సహకరిస్తున్నారా? :సినీ నటి కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసులు పెట్టి, నిర్బంధించిన వ్యవహారం వెలుగులోకి రాగానే సర్కార్ స్పందించింది. ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసింది. ఏ2, ఏ3, ఏ4లుగా ఉన్న ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, పీఎస్సార్‌ ఆంజనేయులు, విశాల్‌ గున్నీలను సస్పెండ్‌ మాత్రమే చేసింది. వారికి నోటీసులు ఇవ్వలేదు, విచారణకు పిలవలేదు. కాంతిరాణా, విశాల్‌ గున్నీ ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేసుకున్నారు. వారు బెయిల్‌ తెచ్చుకోవడానికి యంత్రాంగమే సహకరిస్తోందా అన్నది ప్రశ్న!

అత్యాచారం చిన్న ఆరోపణా? : వైఎస్సార్సీపీ సర్కార్​లో మంత్రిగా పనిచేసిన మేరుగు నాగార్జునపై ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టారు. తనను మోసగించి రూ.90 లక్షలు స్వాహా చేశారని ఈ నెల 1న ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే స్పందించలేదు. వైఎస్సార్సీపీ నేతలు ఆమెపై ఒత్తిడి తెచ్చి, రాజీ కుదుర్చుకునేవరకు వేచిచూశారన్న విమర్శలు గుప్పుమన్నాయి. సామాన్యుడిని ఇలాగే వదిలేస్తారా? మాజీమంత్రి పట్ల ఇంత ఉదారత ఎందుకు చూపారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

నిందితుడే విచారణ చేస్తున్నట్టుంది! :

వైఎస్సార్సీపీ పెద్దల ఆదేశాలతో తనను అక్రమంగా అరెస్ట్ చేసి, కస్టడీలో హింసించారని మాజీ ముఖ్యమంత్రి జగన్, ఐపీఎస్‌లు పీఎస్సార్‌ ఆంజనేయులు, పీవీ సునీల్‌కుమార్, విజయపాల్‌ తదితరులపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై నెల రోజులకు హత్యాయత్నం కేసు పెట్టారు. నాటి జగన్‌ సర్కార్ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అయిన విజయపాల్‌ను ఓఎస్‌డీగా నియమించుకొని, ప్రతిపక్షాల కార్యకర్తల్ని వేధించేందుకు వాడుకుంది.

నేడు సర్వీసులో ఉన్న డీఎస్పీలు, సీఐలు సైతం భయపడేంతగా అప్పట్లో విజయపాల్‌ అధికారం చలాయించారు. రఘురామపై చిత్రహింసల కేసులో నిందితుడైన విజయపాల్‌ను వెంటనే అరెస్ట్ చేయకుండా, ఆయన సుప్రీంకోర్టులో బెయిల్‌ పొందేవరకూ వేచిచూశారు. తర్వాతి విచారణ కూడా సీరియస్‌గా సాగలేదు. తొలుత ఓ సీఐకి, తర్వాత డీఎస్పీకి, చివరకు ప్రకాశం ఎస్పీకి విచారణ బాధ్యత అప్పగించారు. అయినా పురోగతి లేదు. విచారణలో విజయపాలే పోలీసులను తిరిగి ప్రశ్నిస్తున్నారంటే, యంత్రాంగం ఇంత నిశ్చేష్టంగా మారిందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

అరాచక అధికారులకు ఉపశమనమా? :ఆయుష్‌ కమిషనర్‌గా పనిచేసిన ఎస్‌.బి.రాజేంద్రకుమార్‌ వైద్యులు, ఉద్యోగులను మానసికంగా వేధించారని, మహిళా వైద్యులను అసభ్యంగా దూషించేవారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఇంటెలిజెన్స్‌ విభాగం నివేదిక ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఆయన్ను బదిలీతో సరిపెట్టింది. చర్యలు తీసుకోకపోగా, రేపోమాపో మళ్లీ పోస్టింగ్‌ ఇవ్వొచ్చని సమాచారం. గత సర్కార్​లో ఐఆర్‌ఎస్, ఐఆర్‌టీఎస్‌ తదితర కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి అరాచకాలకు పాల్పడ్డ పలువురు అధికారులపై ఏ చర్యలూ లేవు. వారు ఆంధ్ర్ నుంచి రిలీవై, కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నా చోద్యం చూస్తున్నారు.

హోంమంత్రే బేలగా మాట్లాడితే! : ‘సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు నేటికీ నేను బాధితురాలినే. నాపై పెడుతున్న పోస్టులను చదవడానికే భయపడుతున్నా. వాటిని పోలీసులకు ఫార్వర్డ్‌ చేయాలనుకున్నప్పటికీ, ఆ దారుణమైన భాష చూసి సిగ్గుతో పంపించలేకపోతున్నా’నంటూ హోంమంత్రి అనిత ఇటీవల అనంతపురం పర్యటనలో వాపోయారు. వారిని పట్టుకోవడానికి చట్టం సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారని ఆమె బేలగా మాట్లాడారు. సాక్షాత్తూ హోంమంత్రే అంత బేలగా, నిస్సహాయంగా మాట్లాడటమేంటి? తన వద్దనున్న ఆధారాలను డీజీపీ, శాంతి భద్రతల ఐజీలకు ఇచ్చి, అరాచక మూకల ఆట కట్టించాలని ఆదేశాలు ఇవ్వడం, మరీ అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం వంటి చర్యలు తీసుకోవాల్సిందన్న వాదన బలంగా విన్పిస్తోంది.

ప్రజలు తిరస్కరించినా, జగన్‌ బెదిరింపులు :జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు శాంతిభద్రతలపై బాధ్యతాయుతంగా వ్యవహరించలేదన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత విపక్ష నేతగానైనా బాధ్యతగా ఉంటారని కొందరు ఆశించారు. ఆ కొద్దిమందికీ నిరాశ కలిగించేలా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఆలస్యంగానైనా స్పందించి, సోషల్ మీడియా సైకోలపై అక్కడక్కడ చర్యలకు ఉపక్రమించగానే జగన్‌ బయటకొచ్చి బెదిరింపులకు దిగారు.

డీజీపీ నుంచి తిరుపతి ఎస్పీ వరకూ అందరినీ జగన్ బ్లాక్‌మెయిల్‌ చేశారు. జమిలి ఎన్నికలు వస్తాయని, రాకపోయినా నాలుగు సంవత్సరాల తర్వాత తానే అధికారంలోకి వస్తానని, అప్పుడు అధికారుల సంగతి చూస్తానని బెదిరించారు. అసలే మెతగ్గా వ్యవహరిస్తున్న పోలీసులను జగన్‌ వ్యాఖ్యలు ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేశాయి. ఇలాంటి బెదిరింపులకు వెరవకుండా, కఠినంగా వ్యవహరించేలా యంత్రాంగాన్ని సమాయత్తం చేయాల్సిన బాధ్యత సర్కార్​పై ఉంది.

సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్నా :వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ఐదు సంవత్సరాలు పేట్రేగిపోయారు. ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబసభ్యులు, మహిళల్ని కించపరిచేలా అసభ్యంగా పోస్టులు పెట్టారు. ఇప్పటికీ అదే ధోరణిలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, మంత్రులు అనిత, లోకేశ్‌లపై పోస్టులు పెడుతున్నారు. అసభ్యత, అమానవీయతకు వైఎస్సార్సీపీ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి పోస్టులు పరాకాష్ఠ. అలాంటి వ్యక్తిని పట్టుకొని కూడా నోటీసిచ్చి వదిలేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో వైఎస్సార్‌ జిల్లా ఎస్పీపై బదిలీ వేటు పడింది. వాస్తవానికి వర్రాను అరెస్ట్‌ చేసి, హోంమంత్రి అనితపై అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం, మహిళలను కించపరిచినందుకు వర్తించే సెక్షన్‌ల కింద కేసులు పెట్టే ఆస్కారముంది. కానీ, ఆ వ్యక్తి తప్పించుకునేందుకు అవకాశమిచ్చారు.

అప్పుడు పెద్దలు చెప్పినదానికల్లా తలూపారు - ఇప్పుడేమో చల్లగా జారుకున్నారు

సామాజిక మాధ్యమాల్లో విషం కక్కుతున్న వైఎస్సార్సీపీ మూకలు - జల్లెడ పడుతున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details