Kartika Deepotsavam 2024 : కార్తికమాసం చివరిసోమవారం ఈటీవీ చేపట్టిన కార్తిక దీపోత్సవం.. కన్నుల పండువగా జరిగింది. ఈటీవీ లైఫ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన దీపోత్సవంతో ఆధ్యాత్మిక వాతావరణ వెల్లువిరిసింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, ప్రవచనకర్తల ఆధ్యాత్మిక ప్రసంగాలతో కార్యక్రమం ఆద్యంతం భక్తి పారవశ్యంతో సాగింది. దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు.. పరమశివుని స్తోత్రించి దీపాలు వెలిగించి తన్మయత్వంలో మునిగిపోయారు. భాగ్యనగర వాసుల్లో ఆధ్యాత్మికతను తట్టిలేపింది. వందలాది భక్తుల శివనామస్మరణతో స్టేడియం మారుమోగింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల కోలాహలం నడుమ శివకేశవులతో సహా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్తిక దీపోత్సవంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రవచన కర్త చెప్పిన ఉపన్యాసం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.
కార్తిక మాసం స్పెషల్ - ఉల్లి, వెల్లుల్లి లేకుండా అద్దిరిపోయే రుచితో "ఆలూ కుర్మా" - ఇలా ట్రై చేయండి!
"కార్తిక సోమవారం నాడు ఇంత ఘనంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా అదృష్టంగా భావించాను. దీపోత్సవం అవ్వగానే రెండు నిమిషాలు ఉండి వెళ్లిపోదాం అనుకున్నాను.. కానీ ఇక్కడకు వచ్చిన భక్తులను చూశాక చివరి వరకు ఉండాలని అనిపించింది. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన ఈటీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను."- గద్వాల విజయలక్ష్మీ, జీహెచ్ఎంసీ మేయర్