Telangana Commercial Tax Commissioner Sridevi Transfer :వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీదేవికి స్థానచలనం కల్పించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆమె, అసెంబ్లీ ఎన్నికలకు ముందే వాణిజ్యపన్నుల శాఖకు వచ్చినా కొద్దికాలానికే ప్రభుత్వం శ్రీదేవిని ఆ పోస్టు నుంచి తప్పించింది. వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా నియమితులైన రిజ్వి ఇచ్చిన నివేదికతో, ఆమెపై బదిలీ వేటు పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీదేవిని, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా సర్కార్ నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు, పలువురు అధికారులను మార్చినపుడు ఆమెకు కూడా స్థానచలనం కలిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఆమెనే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా నియమించింది.
శ్రీదేవిని 8 నెలలకే ఆ పోస్టు నుంచి తప్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శ్రీదేవి కమిషనర్‌గా వాణిజ్యపన్నులశాఖలో చేరిన తర్వాత ఆదాయం పెంచడానికి తీసుకున్న పలు నిర్ణయాలపై అంతర్గతంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీటికితోడు గతంలో పన్ను ఎగవేతలు, ఈ శాఖలో జరిగిన అక్రమాలపై మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు వాణిజ్య పన్నులశాఖ అధికారులపై ఇటీవల పోలీసు కేసు నమోదైంది. ఈ శాఖకు చెందిన అధికారే, వారిపై ఫిర్యాదు చేశారు. ఇలా కేసు నమోదుచేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.