Essentials Price Increased During DiwaliFestival :దీపావళి అంటేనే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి టపాసులు, పిండి వంటకాలే. అలాంటిది దీపావళి వేళ కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు బాంబులా పేలుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో సామాన్య ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. నెలలోనే పండగ బడ్జెట్ 30నుంచి 40శాతం పైగా పెరిగిందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాపోతున్నారు. రెండు, మూడు రోజులుగా పెరిగిన ధరలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పెరిగిన నూనె, పప్పుల ధరలు: నాణ్యమైన బియ్యం కిలో రూ.60కు పైనే ఉన్నాయి. పప్పులు రూ.100పైగా ఉన్నాయి. గతనెల శనగపప్పు కిలో రూ.64 నుంచి రూ.68 ఉండగా ప్రస్తుతం రూ.101గా ఉంది. మినపప్పు రూ.125 ఉండగా కందిపప్పు ఏకంగా రూ.170కు చేరింది. బెల్లం రూ.55-రూ.70 దాకా ఉంది. లీటరు నూనె కనీస ధర రూ.134గా ఉన్నాయి.
కూరగాయల రేట్లు ఇలా : మార్కెట్లో కూరగాయలు రూ.80నుంచి రూ.100 దాకా ఉన్నాయి. కిలో టమాటా ధర రూ.20నుంచి రూ.30 దాకా ఉంది. దొండకాయ, క్యారెట్, బీర, బెండకాయ, వంకాయ, అన్నీ కిలో రూ.60 పైగా ఉన్నాయి. రైతు బజార్‌లో బీన్స్ ధర రూ.120 ఉండగా రిటైల్‌లో రూ.140కి పైగానే ఉన్నాయి. ఆలు రూ.35నుంచి 50 దాకా ఉంది. వెల్లుల్లి రూ.400కు దిగి రావడం లేదు.
పరిమితంగా కొనుగోళ్లు : ధరల పెరుగుదల ప్రభావం అమ్మకాలపై పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గతంలో కిలోల్లో కొనేవారు ఇప్పుడు అరకిలే తీసుకుంటున్నారని కూరగాయలు విక్రయించే రైతు శ్రీరాములు అన్నారు. కూరగాయల లభ్యత తగ్గడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పరిమితంగా వస్తుండటంతోనే ధరలు పెరుగుతున్నాయన్నారు.