Erra Matti Dibbalu in Danger Zone :విశాఖ జిల్లాలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణపై పర్యావరణ వేత్తలు గళమెత్తారు. ఎర్రమట్టి దిబ్బల సమీపంలో భీమునిపట్నం ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పనులు జోరందుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సర్వే చేయించి హద్దులు తేల్చాకే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
భారీ యంత్రాలతో పనులు :విశాఖలో భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించిన, ప్రపంచ ప్రసిద్ధ ‘ఎర్రమట్టి దిబ్బలు’ముప్పు ముంగిట ఉన్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బల్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో భీమునిపట్నం ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి గతంలో కొన్ని భూములు కేటాయించారు. కొన్నిరోజులుగా ఆ భూముల్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను భారీ యంత్రాలతో తవ్వి చదును చేస్తున్నారు. ఇటీవల ఈ పనులను మరింత వేగవంతం చేశారు. ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఇళ్ల ప్లాట్లకు అనువుగా, లారీలు తిరిగేందుకు వీలుగా బయట నుంచి కొంత గ్రావెల్ తెచ్చి రోడ్లు వేస్తున్నారు. ఎంత వర్షం పడినా నీరంతా భూమిలోకి ఇంకేలా చేయడం ఇక్కడి ఎర్రమట్టి దిబ్బల (Red Mud Dunes) ప్రత్యేకత. అలాంటి సున్నిత ప్రదేశానికి ఆనుకుని పనులు చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రత్యేక విశిష్టత ఉన్న ఎర్రమట్టి దిబ్బలను ప్రమాదంలోకి నెట్టిన వైసీపీ నేతలు- పట్టించుకోని అధికారులు - Red Mud Dunes
లెక్కలు తేలాకే నిర్మాణ పనులు :భీమునిపట్నం ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ (Aided Co-operative Building Society) 1982లో స్థలం కోరగా 49/1 సర్వే నెంబరులో 373.95 ఎకరాలు కేటాయించారు. తర్వాత జియోలాజికల్ సర్వే చేసి బిల్డింగ్ సొసైటీకి ఇచ్చిన భూముల్లో 91.50 ఎకరాలు జియోహెరిటేజ్‌గా (Geoheritage) గుర్తించారు. వాటిని వెనక్కి తీసుకున్నారు. మిగతా భూమిలో, రహదారి విస్తరణకు పోను, బిల్డింగ్ సొసైటీకి సబ్‌డివిజన్ చేసి 118/5ఏ, 118/2 సర్వే నెంబర్లలో కలిపి మొత్తం 280.70 ఎకరాలు ఉంది. దీనిపైనా వివాదం చెలరేగగా సుప్రీం కోర్టులో హౌసింగ్ సొసైటీకే అనుకూలంగా వచ్చింది. భూమి హక్కు సంక్రమించినా ఇది వారసత్వ సంపదకు అనుకుని ఉన్న ఫార్మేషన్ కాబట్టి ఇక్కడ తవ్వకాలపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Pawan Kalyan Inspected Red Mud Dunes: 'ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద... ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం ఆపాలి'
శతాబ్దాల క్రితం భీమిలి సమీపంలో ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయి.1978లో అప్పటి ప్రభుత్వం తొట్లకొండ చుట్టుపక్కల 3వేల ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలున్నట్లు గుర్తించి నిషేధిత జోన్‌గా పేర్కొంది. 2021లో వైఎస్సార్సీపీ సర్కార్ ఈ ఎర్రమట్టి దిబ్బలను 120 ఎకరాలకే పరిమితం చేసిందన్నది పర్యావరణవేత్తల ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయో జియోలాజికల్ సర్వే చేయాలని, అప్పటిదాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని కోరుతున్నారు.
Erra Matti Dibbalu: ఎర్రమట్టి దిబ్బల చెంత ప్రకృతి విధ్వంసం.. భారీ చెట్లను వేళ్లతో సహా పెకిలించిన వైనం