Telangana Samagra Kutumba Survey : రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే వేగంగా సాగుతోంది. కొన్ని జిల్లాలు శతశాతం సర్వేను నమోదు చేయగా, మరికొన్ని జిల్లాల్లో శత శాతానికి దగ్గరగా సర్వే జరుగుతుంది. కొన్నిచోట్ల ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు తలెత్తినా, చాలాచోట్ల సర్వే అంతా సాఫీగానే సాగుతోంది. ముఖ్యంగా సర్వే సిబ్బంది, 'ఇచ్చిన లెక్క ప్రకారం అందరి ఇళ్లూ తిరిగాం. కొందరి ఆచూకీ తెలియడం లేదు. ఇంకొందరి చిరునామా సరిగ్గా లేదు. వారెక్కడుంటారు? వారి గురించి తెలిసిన వారు ఎవరైనా సమాచారం ఇస్తారా? వారిని ఇక్కడికి రప్పించగలరా? లేదంటే కనీసం వివరాలు తెలియజేసేలా చేస్తారా?' అంటూ ఇంటింటికి వెళ్లి సర్వే సిబ్బంది లేని వారి గురించి ఇరుగుపొరుగు వారిని ఆరా తీస్తున్నారు.
ఊళ్లలో లేని వారి వివరాలను సేకరించి ఎలాగైనా సమాచారాన్ని తెలుసుకొని, వారి వివరాలను నమోదు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎవరైనా ఉండి వారు గ్రామానికి వస్తే పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని సూచిస్తున్నారు. సర్వేను పూర్తి చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అధికారులు పత్రాలను తీసుకెళుతున్నారు. గ్రామాలు, కాలనీల్లో పర్యటిస్తున్న ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి సర్వే జరిగే తీరుపై ఆరా తీస్తున్నారు.
చకచకా నమోదు :రోజువారీగా నమోదు చేసిన సర్వేను మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు పర్యవేక్షణ అధికారులు అప్పగిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కో మండలంలో 20-30 కంప్యూటర్లు ఏర్పాటు చేసి సిబ్బంది చేత ఎంపీడీఓలు వివరాలను అందులో భద్రపరుస్తున్నారు. సర్వే పూర్తి అయిన తర్వాత ఆ పత్రాలను పర్యవేక్షణ అధికారులు వీరి వద్దకు చేర్చుతున్నారు. దీంతో చకచకా సమగ్ర కుటుంబ సర్వే వివరాలను నమోదు చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే కంప్యూటరీకరణ చేసినప్పుడు డేటా ఎంట్రీ తప్పులు లేకుండా పక్కాగా చూసుకుంటున్నారు.