Endowments Department Investigation on YSRCP Leader Attack on Priest : కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడి జరిగిన ఘటనను దేవాదాయ శాఖ సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టింది. దేవదాయశాఖ కమిషనర్ విజయరాజ్, ఇతర అధికారులు ఆలయానికి వచ్చి ఘటనపై విచారణ చేపట్టారు. అర్చకుడిపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేత చంద్రరావును దేవదాయశాఖ కమిషనర్ విజయరాజ్ ప్రశ్నించారు. విజయరాజ్ ఎదుట అర్చకుడు, ఆయన భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు కొట్టారో చెప్పాలని చంద్రరావుపై దేవదాయ శాఖ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సమయంలోనూ చంద్రరావు దౌర్జన్యం ప్రదర్శించడంపై దేవదాయశాఖ అధికారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
YSRCP Leader Attack on Priest in Kakinada :పూజారులను వైఎస్సార్సీపీ నేత భక్తుల సమక్షంలోనే కాలితో తన్నడం, కొట్టడం హేయమైన రాక్షస చర్య అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అర్చకుడు అంటే దేవుడికీ, భక్తుడికీ మధ్య అనుసంధాన కర్తగా భావించి కాళ్లకు మొక్కే సంప్రదాయం మనదని గుర్తు చేశారు. కాకినాడలోని శివాలయంలో అర్చకులపై వైఎస్సార్సీపీ నేత చేసిన దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ నేతల అధికార మదానికి, మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపునకు ఇది నిదర్శనమని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు వరుసగా దేవాలయాల్లోని దేవతా విగ్రహాలపై దాడులు జరిగాయన్న ఆయన, ఒక్క కేసులోనూ నిందితులపై చర్యలు లేవని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా గుడిలోని అర్చకులపైనే దాడి చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కాకినాడలో దారుణం - అభిషేకం సరిగా చేయలేదని అర్చకుడిని కాలితో తన్నిన వైసీపీ నేత - YSRCP Leader Attack on Priest
వైఎస్సార్సీపీ నేతను అరెస్ట్ చేయాలని డిమాండ్ : కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడిని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. వైఎస్సార్సీపీ మూకల అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. ఐదేళ్ల జగన్ పాలనలో ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆక్షేపించారు. ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజ సరిగా చేయలేదని దాడి చేయడం హేయమని దుయ్యబట్టారు. గర్భగుడిలో అర్చకులపై వైఎస్సార్సీపీ నేత చంద్రరావు దాడి చేశారన్న లోకేశ్ భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాస లేని అర్చకులపై ప్రతాపం చూపడమేంటని ప్రశ్నించారు. పూజారులపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నాయకుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరో 2 నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేసిన లోకేశ్ ఈ లోగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
మాస్క్ పెట్టుకోమన్నందుకు పూజారిపై దాడి... గుంటూరులో ఘటన
వైఎస్సార్సీపీ నేతలు అధికార మదంతో విర్రవీగుతున్నారు :అధికారం చేపట్టింది మొదలు ఇప్పటి వరకూ బ్రాహ్మణుల జీవితాలతో సీఎం జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నాడని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య ధ్వజమెత్తారు. బ్రాహ్మణులను, అర్చకులను తుదముట్టించి హిందు మతాన్ని నాశనం చేయాలని జగన్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. జగన్ పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవుళ్ల విగ్రహాలు కూలగొట్టారని దుయ్యబట్టారు. భగవంతునికి ప్రత్యక్ష రూపమైన అర్చకుడిని కాలితో తన్నారంటే భగవంతుడిని తన్నినట్టే కదా అని ప్రశ్నించారు. యథా నాయకుడు-తథా క్యాడర్ అన్న చందంగా వైఎస్సార్సీపీ నేతలు అధికార మదంతో విర్రవీగుతున్నారని ఆక్షేపించారు. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై అర్చకులపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. స్వయంగా బాధిత అర్చకులు ఫిర్యాదు చేసినా ఈ ఐదేళ్లలో ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవని వాపోయారు.
'దేవాలయాలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి'