Consumption of Nonveg : మాంసాహారం తెలుగు ప్రజల ఇష్టమైన ఆహారం. ఇటీవల నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వేలో మాంసాహారం అధికంగా తీసుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ (98.25శాతం), తెలంగాణ (97.40శాతం) నాలుగు, ఐడో స్థానాల్లో నిలిచాయి. చాలా మంది బలవర్ధకాహారం కోసం, శరీర సౌష్టవం పెంచుకోవడానికి మాంసాహారానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇంకొంత మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే, నాన్ వెజ్ ఎవరెవరు ఎంత తినాలి? రోజూ తినొచ్చా? వారంలో ఎన్నిసార్లు తినాలి అనే సందేహాలు చాలామందికి ఉన్నవే. అలాంటి వారి కోసం ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
మాంసాహారం అంటే మటన్, చికెన్, చేపలు, రొయ్యలు మాత్రమే కాకుండా ఇంకా కొంత మంది బీఫ్, ఫోర్క్, అటవీ మాంసం కూడా తింటుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పోషకాహార నిపుణులు, డాక్టర్ స్వరూపా రాణి మాట్లల్లో తెలుసుకుందాం.
మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!
'మాంసాహారం మంచిదా? చెడ్డదా? అంటే మంచిదే. శరీరానికి అవసరమైన ప్రొటీన్ (మాంసకృత్తులు), శరీరాభివృద్ధికి ప్రొటీన్ వెజిటెబుల్స్, నాన్‌వెజ్ నుంచి అందుతుంది. వెజిటెబుల్స్ నుంచి వచ్చేది కంప్లీట్ ప్రొటీన్ కాదు. అమైనో యాసిడ్స్ వాల్యూస్ ఎక్కువగా ఉంటే హై బయాలాజికల్ ప్రొటీన్, తక్కువగా ఉంటే లో బయలాజికల్ ప్రొటీన్ అంటారు. మాంసం నుంచి వచ్చేది హై బయాలాజికల్ ప్రొటీన్, వెజిటెబుల్స్ నుంచి వచ్చేది లో బయలాజికల్ వాల్యూ ఉంటుంది. మాంసాహారం రోజూ తిన్నా మంచిదే. కానీ, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నారన్నదే ముఖ్యం. రోజూ 100 నుంచి 150గ్రాముల వరకు సరిపోతుంది. అంతేగానీ కిలోల కొద్దీ తీసుకుంటే కిడ్నీలపై ప్రభావం పడుతుంది. యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. రాళ్లు ఏర్పడతాయి. మాంసాహారంలో చేపలు అన్నింట్లో మంచి ఫుడ్. ఆర్టిఫిషియల్ గా పెంచే చేపలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. సహజసిద్ధంగా చెరువులు, నదుల్లో దొరికే చేపలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది' అని పోషకాహార నిపుణులు, డాక్టర్ స్వరూపా రాణి వెల్లడించారు.
మాంసాహార వినియోగంపై మీకు ఇప్పటికే ఓ స్పష్టత వచ్చి ఉంటుంది. అయితే, వారంలో ఎన్నిసార్లు నాన్‌వెజ్ తినాలి అనే ప్రశ్నకు మాత్రం సరైన జవాబు అందరికీ ఒకేలా ఉండదు. ఆరోగ్య పరిస్థితులు, వయస్సు, చేసే పని, జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి, వారి ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి, ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. నాన్‌వెజ్ ద్వారా ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అధికంగా తీసుకుంటే అవి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, షుగర్ జబ్బులున్నవారు నాన్‌వెజ్ విషయంలో నియంత్రణ పాటించాలి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు తమ ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోజూ కుర్చీలో కూర్చుని జాబ్ చేసే వారు కాకుండా వృత్తి రీత్యా చెమటోడ్చే కార్మికులు, కూలీలు మాంసాహారం రోజూ తీసుకోవచ్చు. ఎరుపు రంగు కలిగిన మాంసం (మటన్ తొడభాగం, కొన్నిరకాల చేపలు) అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. ఇది హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతుంది. అదే విధంగా ప్రాసెస్ చేసిన మాంసం కొలొరెక్టల్ క్యాన్సర్‌కు ముప్పును పెంచుతుంది. అందుకే చికెన్, చేపలు వంటి తెల్ల మాంసాన్ని ఎక్కువగా తీసుకోండి.
Disclaimer: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి.
'తగ్గేదేలే'! - ఆ విషయంలో తెలంగాణను మించిపోయిన ఏపీ - దేశంలో నాలుగో స్థానం