Occupied Lands in Mahabubnagar : కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లు సొరంగ మార్గాల పైనున్న భూములను సైతం అక్రమార్కులు ఆక్రమించేస్తున్నారు. ప్లాట్లుగా మార్చేసి నిబంధనలకు విరుద్ధంగా అమ్మేస్తున్నారు. విషయం తెలియక భూమి కొన్న అమాయకులు మోసపోతున్నారు. సేకరించిన భూమికి హద్దులు నిర్ణయించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో స్థిరాస్తి వ్యాపారులు దర్జాగా కబ్జా చేసి విక్రయిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో పలు గ్రామాల్లో వెలుస్తున్న అక్రమ వెంచర్లపై కథనం.
ఆక్రమణకు గురైన భూములు :మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలంలో నిబంధనలకు విరుద్ధంగా స్థిరాస్తి వ్యాపారం సాగుతోంది. నీటిపారుదల శాఖ సేకరించిన భూములను ఇంటి స్థలాలుగా మార్చి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పలు చోట్ల సొరంగాలు ఉన్నాయి. జడ్చర్ల మండలంలో కరివెన నుంచి ఉదండాపూర్ జలాశయానికి నీళ్లు వెళ్లేందుకు సుమారు 9 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలున్నాయి. ఈ సొరంగ మార్గాలపై నిర్మాణాలు చేపట్టినా బోరుబావులు తవ్వినా సొరంగానికి ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే వాటి ఉపరితలంలో ఉన్న భూముల్ని సేకరించారు. ఎనిమిదేళ్ల కిందటే 15-20 మీటర్ల వెడల్పుతో టన్నెల్ పైభాగంలో భూమిని సేకరించి బాధితులకు పరిహారం చెల్లించారు.
హద్దులు నిర్ణయించి.. సూచిక బోర్డులు :సేకరించిన భూములకు హద్దులు నిర్ణయించి ఆ స్థలంలో భూగర్భంలో సొరంగాలున్నాయని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అలాంటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఆ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములకు డిమాండ్ ఉండటంతో ఆ ప్రాంతాల్లో వెంచర్లు వెలుస్తున్నాయి. వెంచర్ల గోడలపై టన్నెల్‌కు సంబంధించిన భూములంటూ మార్కింగ్ చేసినా ఖాతరు చేయకుండా అమాయకులకు ఆ ప్లాట్లను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు.