Ganesh Chaturthi Festival Celebration 2024 : నవరాత్రి వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్దమైంది. ఖర్చు విషయంలో రాజీపడకుండా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు గణేశ్ మండప నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. నగరంలోని అన్ని మార్కెట్లలో ఆకట్టుకునే వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఈ ఏడాది గణేశ్ నవరాత్రి సందర్బంగా రూ.600 కోట్లకు పైనే వ్యాపారం జరుగుతుందని వర్తక యూనియన్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది 85 వేల వరకు విగ్రహాలు కొలువుదీరగా, ఈసారి 1.2 లక్షల వరకు చేరుతుందంటున్నారు.
Ganesh Idols Making In Dhoolpet 2024: ధూల్‌పేట ఒకప్పుడు గుడుంబా తయారీ కేంద్రంగా ఉండేది. ప్రభుత్వ చర్యలతో ఇక్కడ గుడుంబా వ్యాపారానికి అడ్డుకట్ట పడింది. దీంతో ఎక్కువ మంది ప్రత్నామ్నాయ మార్గాలకు ఎంచుకున్నారు. ఏటా ఇక్కడి శివారు ప్రాంతాల్లో వినాయక చవితి వేల రూ.15 కోట్ల వరకు విగ్రహాల వ్యాపారం జరుగుతుంది. విగ్రహాల తయారీ, విక్రయాలు సాగుతుంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 800 మందికి ఉపాధి లభిస్తోంది. పండుగకు ఆరు నెలల ముందు నుంచే ధూల్‌పేట్‌లో గణేశ్ విగ్రహాల తయారీ ప్రారంభమవుతుంది. ప్రజల ఆసక్తికి అనుగుణంగా రకరకాల విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించి, విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు.
వేలాది మందికి ఉపాధి : సెంట్రింగ్ పనులతో భవన నిర్మాణ కార్మికులకు, వినాయకుని వేదిక అలంకరణతో డెకరేషన్ వారికి, పూజా సామగ్రి విక్రయాలతో వ్యాపారులకు ఉపాధి దొరుకుతుంది. స్వామివారి అన్నదానం, ప్రసాద వితరణతో వంటవారు, కేటరింగ్‌కు ఉదయం, రాత్రి పూజలతో పురోహితులకు, మిఠాయిల తయారీతో వ్యాపారులకు సిబ్బందికి ఆదాయం లభిస్తోంది. వందలాది మంది కళాకారులకు ఉపాధి దొరుకుతోంది.