తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌ - శ్రీశైలం హైవేపై ఇక రాత్రిళ్లూ దూసుకెళ్లొచ్చు - ఆ ప్రాజెక్టు పూర్తయితేనే?

హైదరాబాద్‌ టూ శ్రీశైలం మధ్య రోడ్డు విస్తరణ పనులు - 30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్‌ కారిడార్‌ - 147.31 హెక్టార్ల భూసేకరణ ప్రతిపాదించిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ

Hyderabad to Srisailam Highway
Elevated Corridor in Hyderabad to Srisailam Highway (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 9:51 AM IST

Elevated Corridor in Hyderabad to Srisailam Highway : ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలో మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి. ఈ ప్రాజెక్టుకు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టు నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మీదుగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రాష్ట్ర అటవీశాఖతో ఇటీవలే సమావేశమయ్యారు. ప్రతిపాదిత ప్రాజెక్ట్ గురించి వివరించారు.

147.31 హెక్టార్ల భూసేకరణ :అరణ్యభవన్‌లో జరిగిన మీటింగ్​లో అటవీశాఖ నుంచి పీసీసీఎఫ్‌ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) ఆర్‌.ఎం.డోబ్రియాల్, పీసీసీఎఫ్‌ (వైల్డ్‌లైఫ్‌) ఎలూసింగ్‌ మేరు హాజరయ్యారు. హైదరాబాద్‌-శ్రీశైలం సెక్షన్‌ మధ్య ట్రాఫిక్, రానున్నకాలంలో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని 2 వరుసల నుంచి 4 లేన్లుగా విస్తరిస్తున్నామని వివరించారు. వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తామని మిగతాచోట భూభాగంలోనే రోడ్డును విస్తరిస్తామని తెలిపారు.

ఎలివేటెడ్‌ కారిడార్‌ :ఇక్కడ ఎలివేటెడ్‌ కారిడార్‌ 30 అడుగుల ఎత్తులో ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌-శ్రీశైలం మార్గంలో 128.6 కి.మీ. నుంచి 191 కి.మీ. వరకు రోడ్డువిస్తరణ ప్రాజెక్టును ప్రతిపాదించారు. మన్ననూరుకు ముందున్న బ్రాహ్మణపల్లి నుంచి పాతాళగంగ వరకు తెలంగాణ పరిధిలో జాతీయ రహదారిని విస్తరిస్తారు. పాతాళగంగ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వస్తుంది. తెలంగాణలో 62.5 కి.మీ. మేర రహదారిని విస్తరించాలన్నది ప్రణాళిక. ఇందులో 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అటవీశాఖకు తెలిపారు. రోడ్డు విస్తరణకు అవసరమయ్యే భూమి విషయమై అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేశారు. నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో అటవీ భూమి కావాలని అధికారులు అటవీశాఖకు కోరారు.

కేంద్ర ఉపరితల రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల ప్రజంటేషన్‌ విన్న అటవీ అధికారులు పలు షరతులు పెట్టినట్లు సమాచారం. నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో ఎక్కువ చెట్లు నరకకుండా తక్కువ అటవీ విధ్వంసం ఉండేలా రోడ్డు విస్తరణ ప్రణాళికలో మార్పులు చేర్పులు సూచించామన్నారు. ప్రతిపాదనలు ప్రాథమికదశలో ఉన్నాయని అటవీశాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ అటవీ మార్గంలో మన్ననూరు చెక్‌పోస్టు నుంచి దోమలపెంట చెక్‌పోస్టు మధ్య రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు అటవీశాఖ వాహనాలను లోపలికి అనుమతించడం లేదు.

రాత్రి సమయాల్లో పులులు, ఇతర వన్యప్రాణులు తిరుగుతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధన అమలు చేశారు. రోడ్డును విస్తరించాక ఎలివేటెడ్‌ కారిడార్‌ మీదుగా వాహనాలు 24 గంటలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు వివరించగా ఫ్లైఓవర్‌ మార్గమధ్యంలో వాహనాలు ఎక్కి, దిగేలా ర్యాంపులు నిర్మించొద్దని అటవీశాఖ స్పష్టం చేసిందని సమాచారం. లైటింగ్‌ అధికంగా ఉంటే వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని ఎలివేటెడ్‌ కారిడార్‌పై రాత్రివేళ తక్కువ లైటింగ్‌ పెట్టాలని, నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది.

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నారా? - అయితే మీకో గుడ్​న్యూస్​ - త్వరలోనే!

'కేంద్రంతో బేషజాలకు వెళ్లం - అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్‌ అభివృద్ధి'

ABOUT THE AUTHOR

...view details