ERC Denied to Increase Electricity Charges in Telangana : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాన్య వినియోగదారులపై ఎటువంటి విద్యుత్ ఛార్జీల భారం ఉండబోదని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ శ్రీరంగారావు స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో 2024-25 ఏడాది కాలంలో జెన్-కో, ట్రాన్స్-కో, డిస్కంలు వేసిన పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించింది. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారుల పరిస్థితులు, ప్రభుత్వ సబ్సిడీ తదితర అంశాలను క్రోడీకరించుకుని కమిషన్ పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
డిస్కంలు 57 వేల 728.90 రూపాయలకు ప్రతిపాదనలు పంపితే రూ. 54 వేల 183.28 లకు ఆమోదం తెలిపినట్లు కమిషన్ స్పష్టం చేసింది. రెవెన్యూ గ్యాప్ రూ.13 వేల 022.25 కోట్లు ఉందని దాన్ని భర్తీ చేసుకునేలా అనుమతి ఇవ్వాలని డిస్కంలు కోరగా కమీషన్ కేవలం రూ. 11 వేల 156.41 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపిందన్నారు. సిరిసిల్ల సెస్ రెవెన్యూ గ్యాప్ రూ.494.95 కోట్లు ఉందని, దాన్ని పూడ్చేందుకు అనమతి ఇవ్వాలని కోరగా కమీషన్ 343.11 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపిందన్నారు. ఎస్పీడీసీఎల్కు రూ. 4 వేల 15 కోట్లు, ఎన్పీడీసీఎల్కు రూ.7 వేల 141 కోట్లు, సిరిసిల్ల సెస్‌కు 343.11 కోట్ల రూపాయలు రెవెన్యూ గ్యాప్ ఉందని ఆ మొత్తంతో పాటు ఛార్జీలు కలిపితే మొత్తం రెవెన్యూ గ్యాప్ ఉన్నట్లు డిస్కంలు కమిషన్‌కు నివేదించాయి.
నెలవారీ ఛార్జీలు రూ. 65 నుంచి రూ. 50కి తగ్గింపు :ఎల్.టీ గృహ వినియోగదారులకు ఒకవేయి 699.45 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగానికి రూ. 9 వేల 800.07 కోట్లు మొత్తం కలిపి 11 వేల 499.52 కోట్ల సబ్సిడీని, రెవెన్యూ గ్యాప్‌ను ప్రభుత్వం రాయితీ రూపంలో చెల్లించనున్నట్లు కమిషన్ తెలిపింది. గత ఏడాదితో పోల్చుకుంటే ప్రభుత్వ సబ్సిడీ రూ.2 వేల 374.7 కోట్లకు పెంచిందని, అది 26 శాతం అధికమని కమిషన్ వెల్లడించింది. మొత్తంగా డిస్కంలు 0.47శాతం టారీఫ్‌ను పెంచుకునేందుకు కమిషన్ అనుమతినిచ్చింది. వాస్తవానికి వివిధ వర్గాలకు డిస్కంలు 12 వందల కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతినివ్వాలని కోరగా అందులో రూ.11 వందల 70 కోట్లు సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అదిపోగా మరో 30 కోట్ల రూపాయల భారం పడనుంది. అందులో 800 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించే వారిపైనే భారం పడనుంది.