Electricity Problems in Kadapa District: ఉమ్మడి కడప జిల్లాలో 12 లక్షల 39 వేల 214 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో 12,39,214 విద్యుత్తు సర్వీసులు ఉన్నాయి. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రాయచోటి, మైదుకూరు డివిజన్లలో 33/11 కేవీ సామర్థ్యమున్న ఉప కేంద్రాలు 318 ఉండగా, 22 చోట్ల 33 కేవీ ఉపకేంద్రాలు పనిచేస్తున్నాయి.
ఈ నెల రోజువారీగా కరెంటు కోటా 11.9 మిలియన్ యూనిట్లు కాగా గత 10 రోజులుగా వినియోగం పెరుగుతోంది. కేటాయించిన కోటా దాటిపోవడంతో సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఐదేళ్లలో ఐదు సార్లు విద్యుత్ చార్జీల పెంపు - పేదలపై ₹4వేల కోట్ల భారం
జిల్లాలో చిన్న, మధ్యతరహా, పెద్ద జలాశయాలు 14 ఉండగా, వీటి నిల్వ సామర్థ్యం 84 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29 టీఎంసీల నీరు ఉంది. కొన్ని జలాశయాల్లో కనిష్ఠ స్థాయికి నీటిమట్టాలు పడిపోయాయి. రానున్న వేసవిలో తాగు, సాగు నీటి వెతలు తలెత్తే అవకాశం లేకపోలేదు. పంటలకు నీటిని ఇవ్వాల్సి ఉండగా, జలవనరుల పరిధిలో ప్రధాన, ఉప, పంట కాలువలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు.
ఆయకట్టుకు నీరు అందించే పరిస్థితుల్లేవు. లోటు వర్షపాతం వల్ల జలవనరుల్లో నీటిమట్టాలు తరిగిపోతున్నాయి. కరెంటు వాడకంలో కోటాకు మించి వినియోగిస్తున్నారు. మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వేసవిలో తలెత్తే కరెంటు కష్టాలను తలుచుకుని పల్లె, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో కరెంటు కష్టాలు రాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.