Police CPR To Driver and Saved His Life IN NTR District : ఇటీవల వయసుతో సంబంధం లేకుండా ఎవరు, ఎప్పుడు గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారో తెలియట్లేదు. అప్పటి వరకూ ఆనందంగా ఆడుకుంటున్న చిన్న పాప, డాన్స్ చేస్తున్న యువకుడు, నడుస్తూ నడి వయసు వ్యక్తి ఇలా ఎందరో హార్ట్ ఎటాక్ (Heart Attack) తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే సీపీఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడొచ్చని ప్రభుత్వం, పోలీసులు పలు అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రజలకు సీపీఆర్ ఎలా చెయ్యాలని మెలకువలు చెప్తున్నారు. ఈ మధ్య పలువురు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ పోలీసు గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ఊపిరి పోసిన సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని పోలీసులు కాపాడారు. స్థానిక అశోక్‌నగర్‌కు చెందిన వి.డి.ఎస్. రమేష్ ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. గతంలో ఓసారి గుండెపోటు రావడంతో స్టెంట్లు వేశారు. ఆదివారం విధులకు వెళ్లేందుకు బయలుదేరగా మార్గమధ్యలో గుండెపోటు వచ్చి పడిపోయారు. ఒక వ్యక్తి పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 121కి కాల్ చేసి సమాచారం అందించారు.
వెంటనే నందిగామ ఠాణాలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గద్దల పుల్లారావు, కానిస్టేబుల్ సంతోష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడికి సంతోష్ సీపీఆర్ చేసి ఆటోలో స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు తక్షణం డ్రైవర్‌కు చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. సీపీఆర్ (CPR) చేసి తీసుకురావడం వల్ల ప్రాణాలు కాపాడగలిగామని వైద్యులు చెప్పారు. పుల్లారావు, సంతోష్‌లను సీఐ వైవీవీఎల్ నాయుడు అభినందించారు. పోలీసులు, వైద్యులకు రమేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
విపత్కర పరిస్థితుల్లో కానిస్టేబుల్ (Constable) ఎంతో సమయస్ఫూర్తితో డ్రైవర్ ప్రాణాలు నిలిపారని పలువురు అభినందించారు. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రతీ ఒక్కరు వెంటనే స్పందించి బాధితులకు సాయం చెయ్యాలని పోలీసులు సూచించారు.