Free Solar Power To Selected Villages :తెలంగాణలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజలకు పూర్తి ఉచితంగా సౌరవిద్యుత్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) ఉన్నతాధికారులు అధ్యయనం నిర్వహించారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా సిరిపురంలో కలిపి కనీసం 30 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద సౌరవిద్యుత్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఏయే గ్రామాలను ఎంపిక చేయాలనే అంశంపై రాష్ట్రంలోని రెండు డిస్కంలు కసరత్తు చేస్తున్నారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా :ప్రతి ఇంటిపై (రూఫ్‌టాప్) సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రత్యేకంగా ‘ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని కేంద్ర సర్కారు అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సౌరవిద్యుత్ ఏర్పాటు చేయాలన్నది కేంద్రప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే మోడల్ సోలార్ విలేజ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వశాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) రాష్ట్రానికి పంపిన మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం కింద ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి సౌరవిద్యుత్ ఏర్పాటుచేస్తే రూ.కోటి గ్రాంటుగా ఇస్తారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి, ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. అదేవిధంగా జిల్లాలవారీగా ఒక్కో గ్రామం లేదా ప్రజలు ఆసక్తిగా ముందుకొస్తే వేరేవాటిని కూడా ఎంపిక చేయాలనే అంశంపై డిస్కంలు అధ్యయనం చేస్తున్నాయి. జిల్లాకు ఒకటి ఎంపికచేస్తే కేంద్రం నుంచి రూ.కోటి గ్రాంటు వస్తుంది. ఒకే జిల్లాలో ఒకటికి మించి తీసుకుంటే ఆ సొమ్ము అన్నింటికీ రాదని కేంద్రం స్పష్టం చేసింది.
ఎంపిక చేసిన గ్రామంలో ప్రతి ఇల్లు, కార్యాలయం, వ్యవసాయ బోర్లు సహా మొత్తం అన్నింటికీ సౌరవిద్యుత్‌ను పూర్తిగా డిస్కం వ్యయంతోనే ఏర్పాటుచేయాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సోలార్ విలేజ్ పథకం అమలు కానుంది. స్వయంసహాయక సంఘాలకూ(ఎస్‌హెచ్‌జీ) భాగస్వామ్యం కల్పించనున్నారు.