Electricity Bill Hike in YCP Government:జగనన్న పాలనలో ఆస్తి పన్ను, చెత్త పన్ను పేరెత్తితే జనం హడలిపోతున్నారు. ఇలాంటి జాబితాలో షాక్ కొట్టే మరొకటి కూడా ఉందంటే అది విద్యుత్ బిల్లు. ప్రతి నెలా రీడింగ్ తీసి చేతిలో పెట్టే ఆ బిల్లు చూసిన వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. మనం ఎంత కరెంటు వాడాం ఎంత బిల్లు వచ్చింది అనే చర్చ జరుగుతోంది. వినియోగించిన విద్యుత్తుకు లెక్క కట్టి రుసుం ఎంత చూపుతున్నా ఆ తరువాత క్రమంలో ఉన్న ఒక్కొక్క వరుస చదివిన ఎవరైనా తెల్లబోవాల్సింది. మొత్తంగా జనం జేబులు ఖాళీ అవుతున్నాయి. వైసీపీ నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ బటన్ నొక్కుతున్నాంగా అంటూ తప్పించుకునే ధోరణిలో పాలించారు.
ఐదేళ్లలో ఐదు సార్లు విద్యుత్ చార్జీల పెంపు - పేదలపై ₹4వేల కోట్ల భారం
YCP Put Burden of Electricity Charges on People:వైసీపీ సర్కార్ అన్ని వర్గాల విద్యుత్తు వినియోగదారులపైనా ఛార్జీల భారం భారీగా మోపింది. కొన్ని వర్గాల కనెక్షన్లకు సంబంధించి టారిఫ్‌లో మార్పులు చేయకపోయినా స్లాబులు మార్చి దొడ్డి దారిన ఛార్జీలు పెంచేశారు. వీటికి అదనంగా 2022 ఆగస్టు నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి రెండు విడతల ఇంధన కొనుగోలు ఖర్చు సర్దుబాటు ఛార్జీలను వడ్డిస్తున్నారు. సామాన్యుల కరెంటు బిల్లులో ఈ వడ్డింపులే రూ.120 నుంచి రూ.150 వరకు ఉంటున్నాయి.
అదే పారిశ్రామిక, వాణిజ్య వర్గాల బిల్లుల్లో అదనపు సుంకాలు రూ.వేలల్లో ఉంటున్నాయి. అందుకే కరెంటు బిల్లులు చూస్తేనే షాక్ కొట్టేలా ఉన్నాయి. 2022-24లో విశాఖ సర్కిల్ పరిధిలోని ఉమ్మడి జిల్లా వినియోగదారులపై వివిధ రూపాల్లో రూ.964 కోట్లు అదనపు ఛార్జీల భారం మోపారు. ఈ సంవత్సరం ఎన్నికలు ఉండటంతో పెంపు జోలికి పోలేదు. డిస్కంలు మరో రూ.7 వేల కోట్లు ట్రూఅప్ ఛార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ వద్ద ప్రతిపాదనలు పెట్టారు. ఎన్నికల తర్వాత ఈ భారాన్ని వినియోగదారులపై మోపడానికి సిద్ధంగా ఉంచారు.