Telangana Cabinet Meeting Today : కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశమై, దాదాపు నాలుగు గంటల చర్చల అనంతరం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు, కళాశాలల్లో చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది.
TS Cabinet Meeting Points :ప్రధానంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. అదేవిధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లదేనన్న మంత్రివర్గం, రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని ఆదేశించింది.
EC Green Signal on TS Cabinet Meet : రైతు రుణమాఫీ, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య విభజన అంశాలపై కూడా చర్చించాలని భావించినప్పటికీ, జూన్ 4 వరకు ఆ అంశాలు పక్కన పెట్టాలని ఈసీ ఆంక్షలు విధించింది. జూన్ 4లోగా చేపట్టాల్సిన ఎమెర్జెన్సీ పనులపై మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావొద్దని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.