Three Schools wins in IIT Hyderabad Future Inventors Fair : విద్యార్థుల్లో ఉండే జ్ఞానాన్ని వెలికితీయడానికి విద్యాసంస్థలు కృషి చేస్తున్నాయి. సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాలకు నిర్వహిస్తూ విద్యార్థుల్లోని మేధోసంపత్తిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే ఐఐటీ హైదరాబాద్ ఫ్యూచర్ ఇన్వెంటర్స్ ఫెయిర్-2024 నిర్వహించింది.
సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెంటర్స్ ఫెయిర్-2024లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో ప్రథమంగా నిలిచిన వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రాజెక్టులు ఆవిష్కరించగా బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సుచిత్ర సెయింట్ అండ్రూస్ పాఠశాలలు వరసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువ రాత్రి సమయంలో జరుగుతుంటాయి. డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోవడమే అందుకు ప్రధాన కారణం, ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులేశారు ఈ ఔత్సాహికులు. కునుకు తీస్తే అలారం మోగే కళ్లజోడు తయారు చేసి దాని పనితీరునిలా వివరిస్తున్నారు. తాగేసిన కొబ్బరి బొండలతో మొక్కల పెంపకానికి శ్రీకారం చూట్టారీ విద్యార్థులు.
ప్రత్యేక ఆకర్షణగా చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ : Giving Back to Nature అనే నినాదంలో పారేసిన బొండాల్లో కంపోస్ట్ ఎరువులు వేసి విత్తనాలు నాటుతున్నారు. దీని వల్ల మొక్క త్వరగా పెరగడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందట. పిల్లలు కిడ్నాప్‌కు గురవ్వడం తరచూ వింటుంటాం. వారిని వెతికి పట్టుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారీ విద్యార్థులు.