Ramoji Rao Passed Away in Hyderabad : తెలుగుజాతి మేరునగధీరుడు, రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల రామోజీరావు, హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విచారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
రామోజీరావును పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు. అనంతరం ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించి ఈ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆసుపత్రి నుంచి రామోజీరావు పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్ బిల్డింగ్‌లో రామోజీ పార్థివ దేహాన్ని ఉంచగా కుటుంబసభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు.
Ramoji Rao Death News : అనంతరం వివిధ రంగాల ప్రముఖులు, సంస్థ ఉద్యోగులు రామోజీ రావుకు అశ్రు నయనాలతో నివాళులర్పించారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రామోజీరావుకు నివాళిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు, ఎల్లుండి సంతాప దినాలు ప్రకటించింది. రామోజీరావు అస్తమయంపై సంతాపం తెలిపిన ఫిల్మ్‌ఛాంబర్ రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించింది.
Ramoji Rao Profile :కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబసభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తనే పెట్టుకున్నారు.