Eenadu 50 Years Celebrations : మనం ముసలివాళ్లం కావొచ్చు గానీ, పత్రిక ముసలిది కావడానికి వీల్లేదు. ఎప్పుడూ పాతికేళ్ల యవ్వనంతోనే కొత్త తీరాలకు చేరాలి. ఇదీ ఈనాడు విధాత రామోజీరావు గీసిన గీత. అందుకే ఈనాడు కొత్త ట్రెండ్ సృష్టించడమే తప్ప, ఏనాడూ ట్రెండ్ ఫాలో కాలేదు. నిత్యం ఉషోదయాన సత్యం నినదించేందుకు ప్రతి అడుగూ వైవిధ్యమే. వార్తా రచన నుంచి మార్కెటింగ్ వరకూ ప్రతిదీ కొత్త ప్రయోగమే. పత్రికా భాషకు కొత్త జీవం పోసింది ఈనాడు. మనవైన నుడికారాలు మేళవించి, పత్రికపై మమకారం పెంచింది. పత్రికా భాష పామరులు కూడా జైకొట్టేలా ఉండాలన్నది ఈనాడు విధానం. అందుకే మూసదారిలో, గ్రాంథిక పదాల పంజరంలో చిక్కుకున్న తెలుగు జర్నలిజానికి కొత్త తోవ చూపింది. గ్రాంథిక వాసనలు తీసేసింది. ప్రజల వాడుక భాషను పత్రికకు అనుసంధానించింది. శ్రీ, శ్రీమతి, గారు అనే పదాలను పీకి పారేసింది. యొక్క, మరియు, బడు వంటి వ్యర్థ పదాలను చెత్తబుట్టలో పడేసింది. రచ్చబండ దగ్గర సౌలభ్యంగా మాట్లాడుతున్నంత సరళంగా, వ్యవహారిక భాషలో వార్తా రచన చేసింది. ఏరోజు వార్తలు ఆ రోజే అన్న సూత్రాన్ని పాటిస్తూ, ప్రజా బాహుళ్యంలో విశేష ఆదరణ పొందుతోంది.
Eenadu 50 Years Journey : జర్నలిజానికి కొత్త అర్థం చెప్పింది ఈనాడు. ఈనాడు రాకముందు ఫొటో స్టూడియో నిర్వహకులే పత్రికలకు వార్తలు పంపేవారు. కానీ ఈనాడు పట్టణానికి ఓ విలేకరిని నియమించుకుంది. విలేకరులే వెళ్లి వార్తా సేకరణ చేసేలా మార్గ నిర్దేశం చేసింది. అలా ఈనాడు పత్రికను వేలాది అక్షర సైన్యంగా తీర్చిదిద్దారు రామోజీరావు. అణచివేతకు గురైన అక్షరానికి ధర్మాగ్రహం బోధించారు. పదాల్ని ఫిరంగుల్లా గురి పెట్టారు. బేలచూపుల వాక్యాన్ని బ్రహ్మాస్త్రంలా మలిచారు. శీర్షికలతో శీర్షాసనం వేయించారు. ఇంట్రోలను బంట్రోతులుగా మార్చుకున్నారు. ఫొటోలతో మాట్లాడించారు. క్యాప్షన్లతో కవాతు చేయించారు. కార్టూన్లతో కత్తులు నూరించారు. ఒకప్పుడు వారంలో ఒకట్రెండు రోజులు అవసరాన్ని బట్టి వార్తా పత్రికల్లో కార్టూన్లు వేసేవారు. కానీ ఈనాడు రోజుకో పొలిటికల్ పాకెట్ కార్టూన్ తప్పనిసరి చేసింది. కార్టూన్ల కోసమే పత్రిక కొన్న చందాదారులు, పాఠకులు ఉన్నారంటే అదీ ఈనాడు తెచ్చిన మార్పు.
ఈనాడు రాకముందు ఓ చిన్న పట్టణంలో ఏదైనా సంఘటన జరిగితే, అక్కణ్నుంచి అది పోస్టులోనో, పార్సిల్ ద్వారానో ప్రచురణ కేంద్రానికి వెళ్లి, తర్వాత ఎప్పుడో పత్రికల్లో కనిపించేది. ఈనాడు దానిని సమూలంగా మార్చేసింది. పాఠాకాసక్తికి పెద్ద పీట వేసింది. మన ఊరు - మన వార్తలు అన్నట్టుగా లోకల్ న్యూస్‌ను సింహాసనం మీద కూర్చోపెట్టింది. అప్పట్లో హైదరాబాద్, దిల్లీ వార్తలదే రాజ్యం. అంతర్జాతీయ కథనాలకే అగ్రస్థానం. స్థానికతకు స్థానమే లేదు. ఏ మూలనో చోటిచ్చినా మూడంటే మూడు ముక్కలే. రామోజీరావు ఆ వెలితిని గుర్తించారు. పాత కొలతలకు పాతరేశారు. ఏడంతస్తుల మేడ మీది ఆరుకాలాల వార్తను కాలుపట్టి కిందికి లాగారు. నేలమీద నిలబెట్టారు. ప్రజాగళానికి పట్టం కట్టారు. పత్రికల ప్రాధాన్యాలను పునర్నిర్వచించారు. కాలనీలో చెత్త పేరుకున్నా వార్తే! కుళాయిలో నీళ్లు రాకపోయినా వార్తే. కరెంటు తీగలు తెగిపడినా వార్తే. వీధి కుక్కలు స్వైరవిహారం చేసినా వార్తే. ప్రచురించి తీరాల్సిందే. పెద్దక్షరాల్లో హెడ్డింగ్ పెట్టాల్సిందే.
వేసిన ఫొటో మళ్లీ వేయడానికి వీల్లేదు : పత్రికా రంగంలో ఈనాడు తెచ్చిన మరో విప్లవం ఫొటో జర్నలిజం. పత్రికల్లో ఫొటోల విలువను తొలుత గుర్తించింది రామోజీరావే. ఈనాడు రాక ముందు పత్రికల్లో ఫటోల్లేకుండా వార్తలు ప్రచురించే వారు. ఏదైనా నాయకుల ప్రసంగ వార్తల ప్రచురణకు ఎప్పుడూ ఒకే పాత ఫొటో వాడేవారు. అవీ నాణ్యత, స్పష్టత ఉండవు. రైటప్ ఉన్నా కూడా గుర్తించడం కష్టమే. ఆ దృశ్య దారిద్య్రాన్ని వదిలించారు రామోజీరావు. కృత్రిమత్వపు ఛాయల్లేని ఛాయా చిత్రాలతో ఈనాడు పేజీలకు వన్నె తెచ్చారు. మారుతున్న కాలానికి తగినట్టు సిబ్బందికి ఖరీదైన కెమెరాలు సమకూర్చారు. నాణ్యత, వేగం కోసం సంస్థ ఆవరణలోనే బ్లాక్ మేకింగ్ విభాగాన్ని ప్రారంభించారు. వేసిన ఫొటో మళ్లీ వేయడానికి వీల్లేదని షరతు పెట్టారు. అలా పదునైన ఫొటోలు పతాక శీర్షికల పక్కన సగర్వంగా చోటు సంపాదించుకున్న రోజులున్నాయి.
Eenadu@50 : నలుచెరుగులా ఈనాడు జైత్రయాత్ర – ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు - Eenadu Golden Jubilee Celebrations
సాక్షాత్తూ రామోజీరావే గుట్టల కొద్దీ ఫొటోల్ని ముందేసుకుని కూర్చుని, ప్రచురణ కోసం ఓ ఆణిముత్యాన్ని ఎంపిక చేసిన ఘట్టాలూ లేకపోలేదు. హైదరాబాద్ విమానాశ్రయంలో నాటి ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్‌గాంధీ అవమానించిన విషయాన్ని 8 ఫొటోలతో మొదటి పేజీలో పాఠకులకు అందించింది ఈనాడు. మరుసటి రోజు ఎక్కడ చూసినా ఆ ఫొటోల గురించే చర్చ. అలాంటి ఆర్ట్ ఆఫ్ చూజింగ్‌తో ఫొటో జర్నలిజానికి పట్టం కట్టారు రామోజీరావు. ఆ తర్వాత మిగతా పత్రికలన్నీ ఈనాడు బాటలోనే ఫొటో జర్నలిస్టులను పెట్టుకోవాల్సి వచ్చింది.
జాతీయ పత్రికలకే తెలియని ఆ వార్తను పసిగట్టి : పరిశోధనాత్మక జర్నలిజానికి అంకురార్పణ చేసిందీ ఈనాడే. ఇందిరాగాంధీని జనతా ప్రభుత్వం అరెస్టు చేసి హరియాణా గెస్ట్ హౌస్‌లో ఉంచబోతోందని ముందే చెప్పిన ఏకైక పత్రిక ఈనాడు. జాతీయ పత్రికలకే తెలియని ఆ వార్తను పసిగట్టడం, ఈనాడు నెట్‌వర్క్ సత్తాను దిల్లీ స్థాయిలో చాటింది. ఆనాటి వార్త కాంగ్రెస్ నాయకులకు ఆగ్రహం తెప్పించినా, 1979 డిసెంబర్ 19న ఇందిరను అరెస్టు చేసి, హరియాణా గెస్ట్ హౌస్‌కు తరలించాక విమర్శకుల నోళ్లకు తాళాలు పడ్డాయి. అదీ ఈనాడు విశ్వసనీయత.
1989 జనవరి 26న తెచ్చిన జిల్లాల అనుబంధాలు, పత్రికా రంగంలోనే నవశకానికి నాంది. మన చుట్టూ జరిగే వాటిని పక్కనపెట్టి, ఎక్కడో తెలియని చోట జరిగిన వార్తల్ని స్థానికులపై రుద్దడం ఎప్పటి నుంచో వస్తోంది. మరీ ముఖ్యమైనవైతే తప్ప పత్రికలో ఊరు, పేరు చూసుకోలేని పరిస్థితి. ఆ సంప్రదాయానికి చరమగీతం పాడుతూ ఈనాడు తెచ్చిన జిల్లాకు ఒక అనుబంధం పాఠకులతో గాఢానుబంధం ఏర్పరుచుకుంది. జిల్లా స్థాయిలోని వార్తల్ని సచిత్రంగా, సవివరంగా ఇవ్వడం ఈనాడుతోనే మొదలైంది. స్థానికుల వాణి వినిపించే బలమైన సాధనంగా జిల్లా అనుబంధాలు పత్రికా రంగంలో దేశవ్యాప్త సంచలనం రేపాయి.
ఈనాడు మజిలీలోనే మరపురాని, మరువలేని ఘట్టం : ఆ తర్వాతి కాలంలో అవే టాబ్లాయిడ్స్ సైజుల్లో జిల్లా ఎడిషన్లుగా మారిపోయాయి. అలా పత్రిక పల్లె గుండెల్లోకి చేరింది. ఎక్కడో ఇథియోపియాలో భూకంపం వచ్చిందనే వార్త కన్నా, మన గల్లీల్లోని సమస్యల్ని కళ్లకు కట్టే వార్తలే పాఠకాసక్తి రేపాయి. ఆ స్థానిక వార్తలే ఈనాడు విస్తృతికి చోదక శక్తిగా మారాయి. గ్రామీణ, స్థానిక వార్తలకు చోటు కల్పించడంతో 'ఈనాడు' ప్రజల పత్రికగా రూపాంతరం చెందింది. 1988 నూతన సంవత్సరాన్ని ఈనాడు కలర్‌ఫుల్‌గా ప్రారంభించింది. అప్పటి వరకూ బ్లాక్ అండ్ వైట్‌లో వెలువడిన పత్రిక, రంగుల్లోకి మారిపోయింది. ఇది ఈనాడు మజిలీలోనే మరపురాని, మరువలేని ఘట్టం. రంగుల హెడ్డింగ్‌లు, ఫొటోలు, జిల్లా టాబ్లాయిడ్లు, ఫుల్లవుట్, ప్రత్యేక పేజీలు, ప్రింటింగ్‌లో ఆధునిక టెక్నాలజీ, ఏక కాలంలో పలు ప్రాంతాల నుంచి పబ్లిష్ చేసేలా మల్టిపుల్ ఎడిషన్లతో ఈనాడు వార్తా సమాహార హరివిల్లు.
పత్రిక నిత్యనూతనంగా తొణికిసలాడేలా ఈనాడు ప్రయోగశాలలో లెక్కలేనన్ని ఆవిష్కరణలు జరిగాయి. ప్రత్యేక శీర్షికలు, స్పెషల్ పేజీలెన్నో పాఠకులను రంజింపజేశాయి. రైతే రాజు శీర్షికతో వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు, సరికొత్త వంగడాలు, అభ్యుదయ రైతుల విజయగాథలెన్నో అందించింది ఈనాడు. ఈనాడు అక్షర సారంతో అధిక దిగుబడులు సాధించిన కర్షకులున్నారు. లైంగిక విజ్ఞానం అనే పదాన్ని ప్రస్తావించడానికే నామోషీగా ఫీలయ్యే రోజుల్లో ఈనాడు ఏకంగా 'సెక్స్ సైన్స్' శీర్షికతో శాస్త్రీయ లైంగిక విజ్ఞానాన్ని సమాజానికి అందించింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరంతో ఆర్టికల్స్ రాయించి ప్రచురించింది.
కొత్త గ్లామర్ అద్దుకున్న ఈనాడు : స్పోర్ట్స్ పేజీ బరిలోకి మొదట దిగిందీ ఈనాడే. 1983లో భారత క్రికెట్ జట్టు వల్డ్ కప్ గెలిచాక క్రీడలపై క్రేజ్‌ను రామోజీరావు గమనించారు. అలా 1985లో మొదటి స్పోర్ట్స్ పేజీని ప్రవేశపెట్టారు. స్పోర్ట్స్ న్యూస్ కోసం ఆంగ్ల పత్రికల వైపు చూసిన తెలుగు పాఠకుల్ని ఈనాడు వైపు చూసేలా క్రీడా వార్తలను మలిచారు. క్రీడా వార్తల ప్రచురణలో మిగతా తెలుగు పత్రికలకు ఓ దారి చూపింది ఈనాడు. ఆ ఒరవడిలోనే 1989 జనవరి 30న బిజినెస్ పేజీనీ ప్రారభించింది ఈనాడు. స్టాక్‌మార్కెట్‌పై అప్పటి నుంచే అవగాహన కల్పిస్తూ షేర్లను పల్లెటూళ్లకు తీసుకెళ్లింది. 1991 సెప్టెంబర్ 25 నుంచి చిత్రపురి విశేషాలతో సినిమా పేజీని పాఠకులకు అందిస్తూ ఈనాడు కొత్త గ్లామర్ అద్దుకుంది.
1992 ఏప్రిల్ 10న అందుబాటులోకి తెచ్చిన పెళ్లి పందిరి పేజీ ద్వారా మూడు ముళ్లు, ఏడడుగులు వేసిన కుటుంబాలెన్నో. ఇక మహిళల కోసం మొట్టమొదట ప్రత్యేకంగా ఓ పేజీ తెచ్చి చరిత్ర సృష్టించింది ఈనాడు. మహిళలు వంటింటి కుందేళ్లు కాదంటూ, వారి విజయ గాథలను సమాజం దృష్టికి తెచ్చేలా 1992 సెప్టెంబరు 24న 'వసుంధర' పేజీని ప్రారంభించింది. తర్వాతి కాలంలో దాదాపు అన్ని ప్రాంతీయ పత్రికలూ మహిళా అనుబంధాల్ని ప్రారంభించాల్సిన అనివార్యత సృష్టించిందీ ఈనాడే. 1994 ఏప్రిల్ 15న తెచ్చిన ప్రతిభ పేజీ ఉద్యోగార్థుల విజయసోపానాలకు నిచ్చెనలా పని చేసింది. ఇక ఎన్నికలు, పుష్కరాలు, విశ్వ క్రీడలు ఇలా ప్రతీ ప్రత్యేక సందర్భంలో స్పెషల్ పేజీలతో పాఠకుల్లో కథన కుతూహలం రేపింది ఈనాడు.
చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈ-నాడు, సిరి, ఈతరం, హాయ్ బుజ్జీ పేజీలు ఈనాడు కీర్తి కిరీటంలో సప్తవర్ణశోభితాలు. 2002 జులై 17న విజ్ఞానం, ఆరోగ్యం, క్రీడలు, సాంకేతిక విజ్ఞానం, బాలల వినోదం వంటి అంశాలతో ఇంధ్ర ధనుస్సు వంటి ఏడు ప్రత్యేక పేజీల్ని ప్రారంభించి వినూత్న విప్లవం సృష్టించింది ఈనాడు. కాలానుగణంగా ఈతరం, పాతతరం పాఠకుల పఠనాసక్తికి పట్టంకడుతూ చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈ-నాడు, సిరి, ఈతరం, హాయ్ బుజ్జీ ప్రత్యేక పేజీలు నీరాజనాలు అందుకుంటున్నాయి. మరికొంత కాలానికి వారెవ్వా, మకరందం, రయ్, విహారి, స్థిరాస్తి ఇలా అనేక కొత్త పేజీలు ఈనాడు పాఠకుల చెంతకు చేరాయి.
ఆనాడే అంతర్జాలంలోకి అడుగుపెట్టి : ఇంటర్నెట్ విస్తృతి అంతంత మాత్రంగా ఉన్నప్పుడే ఈనాడు అంతర్జాలంలో అడుగుపెట్టింది. ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్తే పత్రిక చూడలేకపోయామనే వెలితి తీర్చింది. 1999లో ఈనాడు.నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో అరంగేట్రం చేసింది. అప్పటికి ఏ తెలుగు దిన పత్రికా అలాంటి ఆలోచనే చేయలేకపోయింది. పేపర్ ప్రింట్ అయ్యే వరకూ ఆగే పని లేకుండా ఎప్పటికప్పుడు వేగంగా వార్తలందించే వేదికగా ఈనాడు.నెట్ పాఠకుల నీరాజనాలు అందుకుంటోంది. 2007 జులై 12న విశ్వవ్యాప్త తెలుగు ప్రజలు ఈనాడును యథాతథంగా ఇంటర్నెట్‌లో చూసుకునేలా ఈ-పేపర్‌నూ మొదట అందుబాటులోకి తెచ్చిందీ ఈనాడే. అలా అమ్మ, ఆవకాయతో పాటు 'ఈనాడు' కూడా తెలుగువారి దైనందిన జీవితంలో ఒక భాగమైంది. సప్త సముద్రాల అవతల ఉన్న తెలుగు వారికీ ఉషోదయ నేస్తమైంది.
దేశ పత్రికా రంగంలో ఇంకో సంచలనం ఈనాడు ఆదివారం అనుబంధం. అప్పటిదాకా నాలుగు పేజీల బ్లాక్ అండ్ వైట్ అనుబంధం. కానీ ఈనాడు దాన్ని ఓ పుస్తక రూపంలో తెచ్చింది. 1988 ఫిబ్రవరి 28న ఆదివారం మ్యాగజైన్ స్టార్ట్ చేసింది. మొదట్లో 32 పేజీల్లో సగం కలర్ పేజీలే. కొత్త కొత్త వింతలు, విశేషాలు, ప్రతీ వారం ఒక కథ, స్ఫూర్తిదాయక వ్యక్తుల కథనాలు, రసవత్తర రచనలతో కూడిన ఆదివారం అనుబంధం ఈనాడు పాఠకులకు మరో వరమైంది. వారం వారం ఏదో ఒక కొత్త విషయం తెలుసుకున్నామనే సంతృప్తి పాఠకుడికి కలిగిస్తోంది. ఈనాడు ఆదివారం మొదటి పుస్తకాన్ని అభినందిస్తూ అప్పట్లో ఏకంగా 4 వేల 724 ఉత్తరాలు వచ్చాయంటే పాఠకులు ఎంత థ్రిల్‌గా ఫీలయ్యారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈనాడు ఆదివారం బుక్ విడుదలైన మరుసటి వారమే ఈనాడు సర్క్యులేషన్ ఏకంగా లక్ష కాపీలు పెరిగింది. ఆ తర్వాత మిగతా పత్రికలూ ఆదివారం అనుబంధాలు వేసుకోవాల్సి వచ్చిందంటే అదీ ఈనాడు వేసిన రాచబాట.
ఈనాడుకు ఈనాడే పోటీ : తెలుగు పత్రికా రంగంలో ఈనాడుకు ఈనాడే పోటీ. వాక్యనిర్మాణం ఎలా ఉండాలో తనకు తాను నిర్దేశించుకుంది. పాఠకులకు పంటికింద రాయిలా మారే పదాల్ని పరిహరించేసింది. భాషా వేత్త బూదరాజు రాధాకృష్ణ నేతృత్వంలో పత్రికా భాషలో ఏకరూపత తెచ్చింది. 'ఈనాడు భాషా స్వరూపం' పేరుతో 1981లో తెచ్చిన పుస్తకం తెలుగు పాత్రికేయులకు కరదీపికైంది. సుదీర్ఘ అక్షర సమరంలో సుశిక్షితులైన జర్నలిస్టులను సొంతగా తయారు చేసుకుంది ఈనాడు. 1990లో ప్రారంభించిన ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్) తెలుగు జర్నలిజానికి కొత్త నడక నేర్పింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పించింది. వందలాది జర్నలిస్టులను తయారు చేసింది.
ఈజేఎస్ శిక్షణ కూడా ఐఏఎస్, ఐపీఎస్‌లాంటి తర్ఫీదే. ఎంపిక నుంచి శిక్షణ వరకూ అనేక వడపోతల తర్వాత ఔత్సాహిక జర్నలిస్టుల్ని ఎంచుకుంటారు. ఏడాది పాటు పాత్రికేయ ప్రమాణాలతో పాటు సమాజం పట్ల బాధ్యతనూ బోధిస్తోంది ఈజేఎస్. ఈటీవీ, ఈనాడు, ఈనాడు డాట్ నెట్, ఈటీవీ భారత్ వంటి వాటికీ సుశిక్షితులైన అక్షర సైనికుల్ని తయారు చేస్తోంది. ప్రస్తుతం తెలుగు నాట ఒక్క ఈనాడే కాదు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలన్నింటిలోనూ ఈజేఎస్‌లో శిక్షణ తీసుకుని వెళ్లిన ఒక్క అక్షర సైనికుడైనా కనిపిస్తాడు. పత్రికకు పాత వార్తల రిఫరెన్స్ అవసరమని ముందే పసిగట్టిన రామోజీరావు, 1986లోనే రామోజీ ఫిల్మ్ సిటీలో రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ గ్రూప్ (ఆర్‌ఆర్‌జీ)ని ఏర్పాటు చేశారు. ఇది ఈనాడుకు ఆయువుపట్టు.
రామోజీ నాలెడ్జ్ సెంటర్ : దేశ విదేశాల్లో ప్రచురితమయ్యే వందలాది జర్నల్స్, మ్యాగజైన్లు, దేశంలోని వివిధ పత్రికల్లో వచ్చే ప్రధాన వార్తల క్లిప్పింగులు, ఫొటోలు, స్టాటిస్టిక్ సమాచారమంతా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడది రామోజీ నాలెడ్జ్ సెంటర్ (ఆర్‌కేసీ)గా రూపాంతరం చెందింది. పత్రిక ఆవిర్భావం నుంచి ప్రపంచంలో చోటు చేసుకున్న వార్తా సమాచారమంతా ఆర్‌కేసీలో నిక్షిప్తం చేశారు. ఎప్పుడు రిఫరెన్స్ కావాలన్నా వాడుకునేలా, అప్పటి వార్తా పత్రికల్ని స్కాన్ చేసి డిజిటల్‌గా భద్రపరిచారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ హయాం నాటి వీడియోలు కూడా అందుబాటులో ఉన్న ఆర్‌కేసీ, దేశంలో ఏ మీడియా సంస్థకూ లేని ఓ సమాచార భాండాగారం.
పత్రిక నిర్వహణ అంటే ఏ ఒక్కరితో సాధ్యపడదు. రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, పేజ్ మేకర్లు, ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్లు, ఏజెంట్లు ఇలా ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తేనే తప్పుల్లేకుండా పత్రిక ప్రింట్ అవుతుంది. పాఠకుడికి చేరుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ లోటుపాట్లు జరిగినా సమీక్షించుకుని, పొరపాట్లు పునరావృతం కాకూడదన్నదే రామోజీరావు నిర్దేశం. ఈనాడుతోనే సమయం గడిపే రామోజీరావు, సంపాదక బృందానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. పత్రిక బయటకి వచ్చాక దాన్ని ఆమూలాగ్రం చదివేవారు. తప్పొప్పులను స్వయంగా పేపర్‌పై రాసి, ఆయా యూనిట్లకు పంపేవారు. ఎక్కడా ప్రమాణాలు తప్పకుండా, ఈనాడును కాపాడుకొచ్చిన న్యాయమూర్తి రామోజీరావు. పత్రికలో తప్పొప్పుల్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేలా 'ఈనాడు సమీక్ష' అనే వ్యవస్థను ఏర్పాటు చేశారాయన. ఎక్కడైనా తప్పు చేస్తే మందలించడం, బాగా చేస్తే ప్రోత్సహించడం 'ఈనాడు సమీక్ష' పని. జర్నలిజంలో మెళకువలు నేర్చుకోవాలనుకునే వారికి సమీక్ష ఒక గైడ్‌లా పని చేసింది. పత్రిక ప్రమాణాలు పెంపొందించేలా అక్షర సైనికులకు పథ నిర్దేశం చేసింది.
అక్షరాలను బట్టి ఈనాడో కాదో చెప్పేంతగా : నిఖార్సైన న్యూస్‌ను సిద్ధం చేయడమే కాదు వాటిని ఆకర్షణీయంగా పాఠకులకు అందించడమూ ఈనాడు విజయ రహస్యాల్లో ఒకటి. వార్తంశం ప్రాధాన్యతకు అనుగుణంగా హంగులద్ది పాఠకులకు అందిస్తారు. ఈనాడు అక్షరాలంటే మంచు ముత్యాలే. ఒకప్పుడు పత్రికల్లో అక్షరాలు దూరంగా ఒక పొందిక లేకుండా ఉండేవి. గజిబిజిగా పాఠకుల్ని చికాకుపెట్టేవి. ఈనాడు దాన్ని మార్చేసింది. సొంత ఫాంట్ రూపొందించుకుంది. అక్షరాలను ఆర్టిస్టు ద్వారా రాయించి విదేశీ నిపుణులతో వాటిని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయించారు రామోజీరావు. ఇలా రూపుదిద్దుకున్న ఈనాడు అక్షరాలు పాఠకుల్ని ఆకర్షించాయి. ఎక్కడైనా ఓ చిరిగిన పేపర్ ముక్క దొరికినా అందులోని అక్షరాలను బట్టి అది ఈనాడో కాదో చెప్పేంతగా పాఠకుల మదిలో నాటుకుపోయింది ఈనాడు ఫాంట్.
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ఈనాడుదే ముందడుగు. ఒకప్పుడు పీటీఐ, రాయిటర్స్ వంటి సంస్థలు పంపే వార్తలపైనే వార్తా పత్రికలు ఆధారపడేవి. ఆయా వార్తా సంస్థలు పంపే వార్తల్ని అనువదించి ప్రచురించే వారు. మన రాష్ట్రానికి సంబంధించిన కనీసం పది శాతం వార్తలకూ పత్రికలో చోటు దక్కేది కాదు. ఆ పద్ధతిని పక్కన పెట్టేసింది ఈనాడు. ప్రతీ జిల్లా కేంద్రాల్లో టెలీ ప్రింటర్లు నెలకొల్పింది. వేగంగా వార్తలు అందించగలిగే యంత్రాంగాన్ని సమకూర్చుకుంది. మండలానికో విలేకరిని నియమించుకుని, వార్తల్ని అందించింది. మిగతా తెలుగు పత్రికలకన్నా భిన్న కోణాల్లో వార్తలు, విశేషాలు అందిస్తూ పత్రికా పఠనాన్ని పెంపొందించే అక్షర విన్యాసాలు చేస్తూనే ఉంది ఈనాడు.
Eenadu@50 : నిత్యం ఉషోదయాన సత్యం నినదిస్తున్న సమాచార విప్లవ శంఖారావం 'ఈనాడు' - EENADU Golden Jubilee Celebrations