EENADU 50 Years Celebrations : 1975 జూన్ 25 దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయం! అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. అప్పటికి పుట్టి ఏడాదైనా కానీ ఈనాడుకు అది పిడుగుపాటే! ప్రజా ప్రయోజనాలకు ఎవరు నష్టం చేసినా, ప్రజల హక్కులను ఎవరు కాలరాసినా రామోజీరావు సహించరు. అవతల ఎంతటి వారైనా కానీ, ఎలాంటి పర్యవసానాలైనా లెక్కచేయక ముందుండి పోరాడే ధీశాలి ఆయన. ఎమర్జెన్సీలో పత్రికలపై సెన్సార్‌షిప్ విధించటాన్ని రామోజీరావు బాహాటంగానే ఎదిరించారు.
రామోజీరావును దెబ్బకొట్టాలని విఫలయత్నం: 50 ఏళ్ల ప్రస్థానంలో ఈనాడుది ఎప్పుడూ ప్రజాపక్షమే! అది గ్రహించిన పాలకులు తప్పులు సరిదిద్దుకుని ముందుకు వెళ్తే, గిట్టని పాలకులు ఈనాడును అణగదొక్కాలని చూశారు. రామోజీరావును దెబ్బకొట్టాలని విఫలయత్నం చేశారు. తప్పుడు కేసులతో వేధించాలని చూసి భంగపడ్డారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కుంభకోణాల్ని ఈనాడు కడిగిపారేసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల ఆస్తుల్ని అప్పనంగా కొట్టేసిన వ్యవహారాల్ని సాక్ష్యాలతో పాఠకుల ముందుంచింది. నీకిది నాకది అంటూ వేల ఎకరాల భూములు, సహజ వనరుల్ని కట్టబెడుతున్న పన్నాగాన్ని, తెరవెనుక కుటుంబాల్ని నడిబజార్లో నిలబెట్టింది. అవి సహించలేని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈనాడుపై అధర్మ యుద్ధానికి దిగారు. ఈనాడు గ్రూపు సంస్థల ఆస్తుల విధ్వంసానికి వ్యూహరచన చేశారు.
ఈనాడు ఏనాడూ తలదించదు: అసైన్డ్ భూముల సాకుతో రామోజీఫిల్మ్‌సిటీలో షూటింగ్ కోసం నిర్మించిన భవనాల్ని కసిగా కూలగొట్టించారు. ఏపుగా పెంచిన చెట్లనూ కూకటివేళ్లతో పెకిలించేశారు. ఫిల్మ్‌సిటీ పరిసర గ్రామాలకు ఉపయోగపడుతున్న రోడ్లనూ జేసీబీలతో తవ్వించారు. అయినా రామోజీరావు వెనకడుగు వేయలేదు. ప్రభుత్వ వేధింపులను చట్టపరంగానే ఎదుర్కొన్నారు. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే అక్షర సమరం సాగించారు. ఈనాడును ఆదరించిన ప్రజల కష్టం ముందు, తనకు జరిగిన నష్టం ఏపాటిదనే ప్రశ్నే, సవాళ్ల సమయంలో రామోజీరావును మొండి మనిషిగా మార్చింది. అక్షరం రాజీపడడం రాజద్రోహంతో సమానమన్నది రామోజీరావు భావన. అందుకే ఈనాడు ఏనాడూ తలదించదు. తెలుగుజాతిని తలెత్తుకునేలా చేస్తుందేతప్ప తలవంపులు తేలేదు.
దుర్మార్గాలపై అసాధారణ పోరాటం: పాలకుడు నియంతైతే అవినీతి వ్యవస్థీకృతం అవుతుంది. హద్దులు మీరిన అధికారకాంక్ష ప్రజాకాంక్షలను బలిపెడుతుంది. 2019 నుంచి 2024 వరకూ రాష్ట్రంలో జరిగిందదే. నయాఫాసిస్ట్ పాదాల కింద ప్రజాస్వామ్యం నలిగిపోతుంటే ఈనాడు సహించలేకపోయింది. 2019 నుంచి 2024 వరకూ జగన్ దుర్మార్గాలపై అసాధారణ పోరాటం జరిపింది. ప్రశ్నిస్తే వేధింపులు, అడ్డుకుంటే అరెస్టులతో రాష్ట్రంలో ఓ భయకంపిత వాతావరణంలో విలవిల్లాడుతున్న జనావేదనకు ఈనాడు గొంతుకైంది. ప్రభుత్వ రాక్షసకాండను నిర్భీతిగా ఎండగట్టింది.
అక్షరానిదే అంతిమ విజయం:అక్షరానికి, అహంకారానికి హోరాహోరీ యుద్ధం జరిగింది. అందులో సకల రాక్షస గణాలన్నీ ఏకమైనా ఈనాడు ఒక్కటే ఒకవైపు నిలబడి కొట్లాడింది. చివరకు ఈనాడుపై కోపంతో ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరైన మార్గదర్శిపైకి సీఐడీని ఉసిగొల్పారు. సోదాలంటూ చందాదారుల్ని భయపెట్టారు. ఐనా రామోజీరావు రాజీపడలేదు. కుత్తుకమీద కత్తిపెట్టినంత పనిచేసినా అక్షర యుద్ధం ఆపలేదు. 2024 ఎన్నికల్లో అరాచక పాలన నుంచి ఏపీకి విముక్తి ప్రసాదించడంలో తన వంతు పాత్ర విజయవంతంగా పోషించింది. అక్షరానిదే అంతిమ విజయమని చాటింది.
అదీ ఈనాడు అక్షరానికి ఉన్న నిబద్ధత: ఈనాడు శక్తిసామర్థ్యాలు, వార్తల విశ్వసనీయత, అచంచల ప్రజాదరణను గిట్టనివారూ గౌరవించి తీరాల్సిందే! కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాల్ని ఎండగడుతున్న ఈనాడు విజయవాడ ఎడిషన్ ప్రారంభోత్సవానికి నాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని ఆహ్వానించినా ఆయన రాలేదు. అదే చెన్నారెడ్డి తాను నిద్రలేవగానే తన ముందు ఈనాడు పేపర్ ఉండాలంటూ ఒకానొక సందర్భంలో చెప్పడం ఈనాడు వార్తా ప్రమాణాల గౌరవానికి నిదర్శనం! వరదలు, తుపాన్ల సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోడానికి తనకు ఈనాడు ఎంతో సహాయకారిగా ఉందంటూ ఓ సమయంలో మంత్రివర్గ సహచరులు, అధికారులతో చెన్నారెడ్డి చెప్పారు. అదీ ఈనాడు అక్షరానికి ఉన్న నిబద్ధత, విశ్వసనీయత!