Eenadu 50 Years Celebrations : పౌరులు తమ సమస్యల్ని ఎప్పటికప్పుడు విలేకరుల దృష్టికి తెస్తూ, ప్రజల చేతి ఎత్తుబిడ్డగా ఈనాడును పోషించండి! ఇదీ మొదటి సంపాదకీయంలో తెలుగు ప్రజలకు ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు ఇచ్చిన పిలుపు! ఆయన కోరినట్లే ఈనాడును తెలుగు ప్రజలు, తమ మానసపుత్రికగా స్వీకరించారు. తెలుగునాట అగ్రగామిగా నిలిపారు. అలాంటి తెలుగు ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణలోనూ, ఈనాడు ఎప్పుడూ ముందుంటుంది. ఎక్కడో దిల్లీలో కూర్చుని ఇక్కడి తెలుగు నేతల తలరాతల్ని మార్చడాన్ని ఈనాడు సహించలేకపోయింది. తెలుగువారి ఆత్మగౌరవంపై దిల్లీ పెద్దల పెత్తందారీతనానికి వ్యతిరేకంగా ఈనాడు ఎదురు నిలిచి పోరాడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1978-83 మధ్య నలుగురు సీఎంల్ని మార్చారు నాటి దిల్లీ పెద్దలు! కారణం ఏపీ కాంగ్రెస్ నేతలంటే పార్టీ పెద్దలకు చులకన భావం.
1982 ఫిబ్రవరి 3న అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను, ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ అవమానించడం ఈనాడు కెమెరా కంటపడింది. హైదరాబాద్ విమానాశ్రయంలో స్వాగత ఏర్పాట్లపై రాజీవ్ చిర్రుబుర్రులాడడం, అంజయ్య ఆయన్ను బతిమాలుకోవడం, సీఎంను స్పెషల్ ఫ్లైట్‌లో ఎక్కించుకోకుండా రాజీవ్ వెళ్లిపోవడం, అవమాన భారంతో అంజయ్య కంట తడిపెట్టడం! ఇదీ ఆనాటి పరాభవం. ఇది ముఖ్యమంత్రికే కాదు, ఆంధ్రులకు జరిగిన అవమానమని ఈనాడు కలం ఝుళిపించింది. రానే వచ్చెను రాజీవ్‌గాంధీ, పోనేపోయెను అంజయ్య పరువు అంటూ 8ఫోటోలతో అసలేం జరిగిందో పాఠకుల కళ్లకు కట్టింది! రాష్ట్ర కాంగ్రెస్ నేతల బానిస మనస్తత్వంపైనా బెత్తం ఎత్తింది.
ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడానికి బీజం వేసింది ఈనాడు :ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత భర్తీ కోసమూ ఈనాడు అక్షర యాగం చేసింది. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించి, తెలుగునాట కొత్త రాజకీయం పొద్దుపొడిచేలా తనవంతు పాత్ర పోషించింది! ఆనాడు అధికార కాంగ్రెస్‌కు ఈనాడే ప్రతిపక్షం అన్నట్టు రాజకీయ పరిస్థితులుండేవి. ఆ తరుణంలో ఓ రాజకీయ పార్టీ స్థాపించాలని రామోజీరావుపై అనేకమంది ఒత్తిడి చేశారు! ప్రత్యామ్నాయ రాజకీయం రాష్ట్రానికి అందించాలని ఒప్పించే ప్రయత్నం చేశారు! ప్రజాహితం తప్ప రాజకీయ ఆకాంక్ష, పదవీకాంక్ష లేని రామోజీరావు, తనపై వచ్చిన ఒత్తిళ్లను సున్నితంగా తిరస్కరించారు. అదే సమయంలో తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు నందమూరి తారక రామారావు!
అప్పుడే పుట్టిన తెలుగుదేశాన్ని కొందరు ఎగతాళి చేస్తుంటే ఈనాడు ఒక్కటే మద్దతుగా నిలబడింది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేనప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉద్భవించడం చారిత్రక పరిణామమని ప్రజలకు వినమ్రంగా వివరించింది. అలా ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు. నూతన రాజకీయ సంస్కృతి రావాలని, అధికారం ఏకస్వామ్యం కాకూడదని కారాదనే భావనతో, ప్రజాభీష్టానికి ఈనాడు కూడా పెద్దపీట వేసింది. ఆనాడు ఈనాడు పోషించిన పాత్రే దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడానికి బీజం వేసింది. కొత్త ఫ్రంట్‌లు ఏర్పడి, కాంగ్రెస్‌ను మట్టికరిపించడానికి మార్గదర్శనమైంది.
తెలుగుదేశం ఆవిర్భావంతో కొత్తతరం నేతలెందరో రాజకీయ యవనికపైకి వచ్చారు. అలాంటి వారిని సమాజానికి అందించడంలో ఈనాడు ప్రధాన పాత్ర పోషించింది. డాక్టర్లు, లాయర్లు, వివిధ వృత్తులతో ప్రజలకు దగ్గరైన నవయువకులను చట్టసభకు పంపడంలో దోహదపడింది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం 9 నెలల్లోనే అధికారంలోకి రావడానికి ఈనాడు అక్షరాలు సోపానాలయ్యాయి! రాష్ట్ర రాజకీయాన్ని ఆవహించిన నియంతృత్వాన్ని ప్రతిఘటించడమే ఆనాడు ఈనాడు కర్తవ్యం! తెలుగుదేశం ప్రభుత్వం మంచి చేస్తే ఈనాడు అభినందిస్తుందని, తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని 1983 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే సంపాదకీయం రాశారు! దానికి తగ్గట్లే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను నిర్మొహమాటంగా నిలదీసింది!
తెలుగు ప్రజల్లో పౌరుషాగ్ని రగిల్చి ప్రజా ఉద్యమానికి అగ్ని బావుటా : తెలుగుజాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినప్పుడల్లా ఈనాడు అక్షరాలు అగ్ని బాణాలై దూసుకుపోయాయి. దానికి నిదర్శనమే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు సాగించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణోధ్యమం! పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్, ఆనాటి ప్రధాని ఇందిరకు కొరకరాని కొయ్యలా కనిపించారు. ఎన్టీఆర్‌పై రగిలిపోతున్న ఇందిర, తెలుగుదేశం అసంతృప్త నేత నాదెండ్ల భాస్కరరావును ఓ పావులా ప్రయోగించారు! ఆనాటి గవర్నర్ రామ్‌లాల్‌ను కీలుబొమ్మగాచేసుకున్నారు. 1984లో చికిత్స కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లగానే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఆ వెంటనే నాదెండ్ల భాస్కరరావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.