2008 DSC Teacher Postings : డీఎస్సీ-2008లో నష్టపోయిన వారిలో 1,382 మంది బీఈడీ అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ వారం రోజుల్లో కాంట్రాక్టు విధానంలో టీచర్ ఉద్యోగాలు ఇవ్వనుంది. వారిని సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్‌జీటీ)లుగా నియమిస్తూ ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి, మెరిట్ జాబితాలో ఉన్నా బీఈడీ అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు దూరమయ్యారు.
ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం : తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని నాటి నుంచి వారు పోరాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటీ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన అనంతరం వారికి కాంట్రాక్టు విధానంలో మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం 2024 సెప్టెంబరు 24న కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది.
కాంట్రాక్టు ప్రాతిపదికన 1382 మంది : 2008 డీఎస్సీ నోటిఫికేషన్లో నష్టపోయిన అభ్యర్థులు మొత్తం 2,367 మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్కలు సేకరించింది. వారికి సంబంధించిన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని, కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ)గా పని చేస్తామంటూ అభ్యర్థులు ఒప్పుకోవాల్సి ఉంటుందని విద్యాశాఖ కోరగా వెంటనే 1,382 మంది కాంట్రాక్టు విధానంలో పనిచేయడానికి అంగీకరించారు.