Telangana EAPCET Results 2024 :తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను ప్రకటించారు. గతంలో ఎంసెట్ నిర్వహించేవాళ్లమని, మొదటిసారి ఈఏపీ సెట్ పేరుతో పరీక్ష నిర్వహించామని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ పరీక్షకు 3,32,251 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 91,633 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది పరీక్ష రాశారని చెప్పారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌లో 74.98 శాతం , అగ్రికల్చర్, ఫార్మసీలో 89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
ఫలితాలను చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు : ఈఏపీ సెట్‌కు గత పదిసంత్సరాల్లో లేనతంగా విద్యార్థులు ఈసారి దరఖాస్తు చేసుకున్నారని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. గతంలో ఒక్కో షిఫ్ట్‌లో 25,000ల మంది మాత్రమే పరీక్ష రాసేవారని, కానీ ఇప్పుడు ఒక్కో షిఫ్ట్‌లో 50,000ల మంది పరీక్ష రాసినట్లు వివరించారు. ఫలితాలను చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇంజినీరింగ్‌లో తొలి పది ర్యాంకుల్లో తొమ్మిదింటిని బాలురు కైవసం చేసుకున్నారని అన్నారు. ఇందులో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులకు వచ్చాయని బుర్రా వెంకటేశం వెల్లడించారు.
ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్లు వీళ్లే :
- మొదటి ర్యాంకు ఎస్.జ్యోతిరాదిత్య(శ్రీకాకుళం-పాలకొండ)
- రెండో ర్యాంకు గొల్లలేఖ హర్ష(కర్నూలు-పంచలింగాల)
- మూడో ర్యాంకు రిషి శేఖర్‌శుక్లా(సికింద్రాబాద్-తిరుమలగిరి)
- నాలుగో ర్యాంకు భోగలపల్లి సందేశ్(హైదరాబాద్-మాదాపూర్)
- ఐదో ర్యాంకు మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి(కర్నూలు)
- ఆరో ర్యాంకు పుట్టి కుశల్‌కుమార్(అనంతపురం-ఆర్కేనగర్)
- ఏడో ర్యాంకు హుండికర్ విదీత్(హైదరాబాద్-పుప్పాలగూడ)
- ఎనిమిదో ర్యాంకు రోహన్(హైదరాబాద్-ఎల్లారెడ్డిగూడ)
- తొమ్మిదో ర్యాంకు కొంతేమ్ మణితేజ(వరంగల్-ఘన్‌పూర్)
- పదో ర్యాంకు ధనుకొండ శ్రీనిధి(విజయనగరం)