ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డబ్బులు లేవంటే రుణం ఇప్పించి మరీ మోసం చేశారు !

విద్యావంతులే ఎక్కువగా డిజిటల్‌ అరెస్టు మోసాల బారిన పడుతున్నారు- తాజాగా రూ.30లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

educated_people_affected_by_more_by_cyber_criminals
educated_people_affected_by_more_by_cyber_criminals (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Educated People Affected by More By Cyber Criminals :ఇటీవలి కాలంలో డిజిటల్‌ అరెస్టు పేరిట మోసాలు గణనీయంగా పెరిగాయి. ఉన్నత విద్యావంతులే ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసాలకు గురవుతున్నారు. లక్షల్లో తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. సీబీఐ, ఆర్బీఐ, కస్టమ్స్, పోలీసు తదితర ఏజెన్సీ అధికారులమని చెప్పి నమ్మించి అరెస్టు చేస్తామంటూ బెదిరించి తమ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు.

వీడియో కాల్స్‌ చేసి మరీ పోలీసులమని భ్రమింపజేస్తున్నారు. దీంతో అరెస్టవుతామనే భయంతో పలువురు వీరి వలలో చిక్కి అడిగినంతా ముట్టజెప్పుతున్నారు. స్వయంగా ప్రధాని మోదీ సైతం అక్టోబర్​ 27న జరిగిన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ఈ అంశం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అయినా ఇంకా పలువురు మోసపోతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

డబ్బులు లేవన్నా రుణం ఇప్పించి మరీ :విజయవాడకు చెందిన ఓ యువతి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. సంతోషంగా దీపావళి పండగ జరుపుకొందామని, తన సొంతింటికి చేరింది. ఆమెకు మూడు రోజుల కిందట ఓ కాల్‌ వచ్చింది. తాము ముంబయిలోని క్రైం బ్రాంచి పోలీసులమని ఫోన్‌లో వారు ఆమెకు తెలిపారు. మీ బ్యాంకు ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని, విచ్ఛిన్నకర శక్తుల ఖాతాలకు డబ్బులు పంపించినట్లు గుర్తించామని వివరించారు. అంతటి ఆగకుండా మీ పేరిట వచ్చిన పార్సిల్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు తెలిసిందని ఆ మహిళను బెదరగొట్టారు.

మీపై అరెస్టు వారెంట్‌ జారీ అయిందని హడలెత్తించారు. మరిన్ని వివరాలు వీడియో కాల్‌లో డీసీపీ మాట్లాడతారని స్కైప్‌లో కాల్‌ కనెక్ట్‌ చేశారు. అవతల పోలీసు స్టేషన్‌లా ఉన్న గదిలో యూనిఫారంలో ఉన్న అధికారి మాట్లాడటం మొదలు పెట్టారు. రెండు రోజుల్లో మీ ఇంటికి పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్టు చేయబోతున్నారని బెదిరిస్తున్నట్లుగా మాట్లాడారు. చెప్పిన బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలని, అప్పుడే అరెస్టు ఆగుతుందని పోలీసు అధికారి వేషధారణలో ఉన్న వ్యక్తి గట్టిగా దబాయించాడు. ఎక్కువ సమయం లేదని ఒత్తిడి చేశాడు.

"ఆ స్టాక్​లో కళ్లు చెదిరే లాభాలు" - ఏడు బ్యాంకు ఖాతాలకు రూ.1.21 కోట్లు - ఏమైందంటే!

తన వద్ద డబ్బు లేదని సమాధానం ఇచ్చినా వారు కనికరించలేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు బ్యాంకులు పెద్ద మొత్తాల్లో రుణాలు ఇస్తాయని, మీకు ఎంత అర్హత ఉందో మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లోకి వెళ్లి చూడమని కేటుగాళ్లు సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లే యాప్‌లోకి వెళ్లి రుణం కోసం యాప్‌లోనే దరఖాస్తు చేసుకోవడం, పది నిముషాల్లో ఆమె ఖాతాలో నగదు జమ కావడం జరిగిపోయింది. వెంటనే ఆమె మోసగాళ్లు చెప్పిన ఖాతాలకు రూ.20లక్షలు బదిలీ చేసింది.

అంతటితో ఆగని మోసగాళ్లు మళ్లీ దీపావళి నాడు ఫోన్​ చేసి ఇంకా డబ్బులు కావాలని బెదిరించారు. ఆమె మరింత భయపడిపోయి గురువారం ఉదయం మరో రూ.10 లక్షలు వారి ఖాతాలకు బదిలీ చేసింది. ఇలా మొత్తం రూ.30లక్షలు రెండు విడతలుగా పంపించింది. ఆ తర్వాత కేటుగాళ్ల నంబరుకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా స్విచాఫ్‌ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు ఆమె గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.

‘ ఇటీవలి కాలంలో దేశంలో చాలా మంది, వయసులతో సంబంధం లేకుండా డిజిటల్‌ అరెస్టు మోసాల బారిన పడుతున్నారు. భయంతో తమ కష్టార్జితాన్ని మోసగాళ్లకు చెల్లించుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఎదురైతే భయాందోళనలకు గురికావొద్దు. మీకు దేశంలోని ఏ దర్యాప్తు ఏజెన్సీ నుంచి ఈ తరహాలో ఫోన్‌ కాల్స్‌ కానీ వీడియో కాల్స్‌ కానీ రావు.’- గత నెల 27న మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో డిజిటల్‌ అరెస్టు నేరాలపై ప్రధాని మోదీ ప్రసంగం

డిజిటల్‌ రక్షణకు ప్రధాని మోదీ మూడంచెల సూచనలు

  • ఆగండి: ఇటువంటి కాల్స్‌ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి. భయపడి వ్యక్తిగత సమాచారాన్ని మోసగాళ్లకు ఇవ్వొద్దు. వీలైతే స్క్రీన్‌షాట్‌ తీసుకోవడంతో పాటు రికార్డు చేసుకోవడం మంచిది.
  • ఆలోచించండి : చట్టబద్ధ ఏజెన్సీలు ఫోన్‌కాల్స్, వీడియో కాల్స్‌ ద్వారా దర్యాప్తు చేయవు. డబ్బులు డిమాండ్‌ చేయవు.
  • ఆ తర్వాత స్పందించండి :నేషనల్‌ సైబర్‌ హెల్ప్‌లైన్‌ నెంబరు 1930కు ఫిర్యాదు చేయాలి. cybercrime.gov.in లో ఆధారాలను నమోదు చేయాలి.

రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు - జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లే

ABOUT THE AUTHOR

...view details