ED Raids on MLC Kavitha Relative Houses :దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha Arrest) బంధువుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల నివాసాల్లోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారురు. మాదాపూర్‌లోని డీఎస్ఆర్ రేగంటి అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.
ED Raids in Hyderabad Today :ఇదివరకే కవిత భర్త అనిల్ కుమార్‌ను విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇందుకు ఆయన హాజరుకాలేదు. దీంతో ఇప్పుడు బంధువుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేయడం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కవిత అల్లుడు మేక శరణ్ పేరును రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో అధికారులు ప్రస్తావించారు.
ED Raids At Kavitha Nephew's House :కవిత ఇంట్లో చేసిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని ఆయన్ను రెండుసార్లు విచారణకు పిలిచినా హాజరు కాలేదని ఈడీ పేర్కొంది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ కీలకపాత్ర పోషించారని, అతడు కవితకు అత్యంత సన్నిహితుడని తెలిపింది. కవిత అరెస్ట్ జరిగినప్పుడు శరణ్ ఆ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్‌లో వెల్లడించింది. ఆ సమయంలో శరణ్ ఫోన్ సీజ్ చేసి పరిశీలించగా, అందులో సౌత్ లావాదేవీలకు చెందిన సమాచారం గుర్తించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వివరించింది.
దిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత కుట్రదారు - కస్టడీ పిటిషన్‌లో వెల్లడించిన ఈడీ
ఈ క్రమంలోనే కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లల్లో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఓవైపు కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు చేసిన అధికారులు, ఇదే సమయంలో మాదాపూర్‌లో నివసించే కవిత అల్లుడు మేక శరణ్ నివాసంలోనూ తనిఖీ చేశారు. మేనల్లుడి ద్వారా కవిత ఆర్ధిక లావాదేవీలు జరిపినట్టు ఈడీ భావిస్తున్న నేపథ్యంలోనే శరణ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు, దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అల్లుడు శరణ్ పాత్రపై ఆరా తీశారు.
MLC Kavitha ED Custody Extended :మరోవైపుదిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత ఈడీ కస్టడీని న్యాయస్థానం మరో మూడు రోజులు పొడిగించింది. గతంలో ఇచ్చిన ఏడు రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. ఆమెను మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ వేసింది. దీనిపై జరిగిన విచారణలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. కేసు దర్యాప్తు పురోగతిని న్యాయస్థానానికి వివరించిన ఈడీ తరపు న్యాయవాది. కస్టడీ పొడిగిస్తే దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరిని కవితతో కలిసి విచారిస్తామని తెలిపారు.
కవిత కుటుంబ వ్యాపార లావాదేవీలపై విచారణ చేస్తున్నట్టు తెలిపిన ఈడీ, మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కవిత తన ఫోన్‌లో డేటాను తొలగించారని, కుటుంబ ఆదాయపన్ను, వ్యాపారాల వివరాలడిగినట్లు ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ వివరాలు ఇంకా ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే కవిత ఈడీ కస్టడీలో ఉంటే వివరాలు ఎలా ఇవ్వగలరని ఆమె తరపు న్యాయవాది నివేదించారు. చివరకు కవితను మరో మూడ్రోజులు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్న కవిత తరపు న్యాయవాది వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు. ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారన్న కవిత, వాటిపై న్యాయపరంగా పోరాటం చేస్తానని వెల్లడించారు.
కవిత అరెస్టులో నిబంధనల ఉల్లంఘన లేదు - కస్టడీ ఉత్తర్వుల్లో రౌజ్‌అవెన్యూ కోర్టు న్యాయమూర్తి
‘నన్ను అక్రమంగా అరెస్టు చేశారు’ - సుప్రీంకోర్టులో కవిత పిటిషన్