ED Case Against Operation Mobility Organization :విద్యార్థులకు ఉచిత విద్య, ఆహారం అందిస్తున్నామని విదేశాల నుంచి సేకరించిన విరాళాలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఆపరేషన్ మొబిలిటీ సంస్థపై ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా ఈనెల 21,22 తేదీల్లో హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయం సహా 11 చోట్ల సోదాలు చేసింది. ఈ సోదాల్లో పలు ఆస్తుల డాక్యుమెంట్లు, బినామీ కంపెనీల లావాదేవీలు, డిజిటల్ పరికరాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. తెలంగాణ సీఐడీలో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఓమ్ సహా ఇతర సంస్థల పేరుతో విదేశాలకు చెందిన దాతల నుంచి రూ.300 కోట్ల మేర నిధులు సేకరించినట్లు గతంలో సీఐడీ గుర్తించింది. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, అర్జంటీనా, డెన్మార్క్, జర్మనీ, బ్రెజిల్, ఫిన్ లాండ్, ఐర్లాండ్, మలేషియా, రుమేనియా, సింగపూర్, నార్వే సహా మొత్తం 16 దేశాల నుంచి విరాళాలు సేకరించినట్లు గుర్తించింది. వారు సుమారు 100 పాఠశాలల్లో చదువుతున్న దళితులు, అనాధ పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపి ఆ సంస్థ విరాళాలు సేకరించింది.