Sun Parivar Ponzi scam case :సన్ పరివార్ పోంజి స్కీమ్ కేసులో 25.20కోట్లు ఆస్తులను ఈడీ ఆటాచ్ చేసింది. తెలంగాణలో పలు చోట్ల నమోదైన ఎఫ్ఐఆర్లతో పాటు, ఏపీ డిపాజిటర్ల చట్టం కింద నమోదైన కేసుల ఆధారంగా ఈడీ(Enforcement Directorate) దర్యాప్తు చేపట్టింది. సన్ పరివార్ గ్రూప్(Sun Parivar) పేరుతో మెతుకు రవీందర్ అతని సహచరులు, అధిక వడ్డీలకు ఆశచూపి సుమారు 10వేల మంది నుంచి రూ. 158కోట్లు సేకరించారు.
అధిక వడ్డీ ఆశ చూపించారు - సొమ్ము చెల్లించాక బోర్డు తిప్పి ఉడాయించారు
సన్ పరివార్ గ్రూప్‌లోని అనుబంధ కంపెనీలైన మెతుకు చిట్‌ఫండ్స్, మెతుకు వెంచర్స్ లిమిటెడ్, మెట్‌సన్ నిధి లిమిటెడ్, మెతుకు హెర్బల్ లిమిటెడ్, మెడికల్స్ పలు కంపెనీల పేరిట డిపాజిట్లు సేకరించి, వాటితో స్థిర చరాస్థులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. కుటుంబ సభ్యులు, సహచరుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసిన మెతుకు రవీందర్, మోసం బయటపడటంతో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు.
విడులైన తర్వాత మరో ఫోంజి స్కీమ్ ప్రారంభించి పెట్టుబడులు స్వీకరించిన రవీందర్, అధిక వడ్డీలు, ఏడాదిలో 100 శాతం లాభాలంటూ అమాయకులను మోసం చేశాడు. అతనిపై నమోదైన కేసులో విచారణ ప్రారంభించిన ఈడీ, దర్యాప్తులో భాగంగా మెతుకు రవీందర్, అతని సహచరులకు సంబంధించిన రూ. 25.20 కోట్ల స్థిర చరాస్థులు, బ్యాంకు బ్యాలెన్స్, షేర్లను అటాచ్ చేసింది.