Eating Pizza Side Effects : ఆకలేస్తే బేకరికి.. బోర్ కొడితే సినిమాకు అని పాడుకునే రోజులివి. అందుకే చాలా మంది చలో క్యాంటిన్ అంటారు. ఇంట్లో రొటీన్ ఫుడ్ బోర్ కొడుతోందంటూ.. పిజ్జాలు, బర్గర్స్ ఆరగిస్తూ, కూల్ డ్రింక్స్ ఆస్వాదిస్తుంటారు. అయితే.. ఎప్పుడో ఒకప్పుడు తింటే పెద్దగా ప్రాబ్లమ్ లేదు. కానీ.. నిత్యం లాగిస్తే మాత్రం శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఊబకాయం..
ఒక సాదా చీజ్ పిజ్జా స్లైస్లో దాదాపు 400 కేలరీలు ఉంటాయట. ఇలాంటి స్లైస్లు రెండు లేదా మూడు తినడం వల్ల మీ ఒంట్లోకి 800 నుండి 1,200 కేలరీలు చేరుతాయి. ఈ పిజ్జా ముక్కలకు ప్రాసెస్ చేసిన టాపింగ్స్ యాడ్ చేసినప్పుడు.. ఈ కేలరీల పర్సెంట్ మరింతగా పెరుగుతుంది. వీటికితోడు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ వల్ల వచ్చే కేలరీలు వీటికి జత అవుతాయి. ఇలా కుప్పలు తెప్పలుగా ఒంట్లో కేలరీలు పెరిగిపోవడం వల్ల బరువు అధికంగా పెరుగుతారని హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. చాలా మందిలో అది సాధ్యం కాకపోవచ్చు.
గుండె జబ్బుల ప్రమాదం..
పిజ్జాలు అతిగా తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిజ్జాలోని చీజ్, ఇంకా ప్రాసెస్ చేసిన మీట్ టాపింగ్స్ లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని చెబుతున్నారు. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింతగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. రెండు, మూడు పీసులే అంటూ నిత్యం తింటే ఆరోగ్యానికి తీవ్రంగా హాని కలుగుతుందని అంటున్నారు.