Earth Quakes In Two Telugu State :తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ రోజు ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తెలంగాణలోని ముగులు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ - ఎన్‌జీఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలో మీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, ఏలూరు, నందిగామ సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో భూమి కంపించింది.
గుజరాత్లో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 3.7తీవ్రత నమోదు
హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, చింతకాని, చర్ల, ఇల్లెందు, నాగులవంచ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని సిర్వంచ, అహేరి, గడ్చిరోలి, చంద్రాపూర్‌లో భూప్రకంపనలు వచ్చాయి. ఛత్తీస్గడ్‌లోని సుకుమా, బీజాపూర్ లోనూ భూమి కంపించింది.
ఎలాంటి నష్టం వాటిల్లలేదు :ములుగు సమీపంలో ఉదయం వచ్చిన భూకంపంతో ఎలాంటి నష్టం జరగలేదని జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. భూకంపంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. గోదావరి సమీప ప్రాంతంలోని ములుగు వద్ద 5.3 తీవ్రతతో ఉదయం ఉదయం 7.27 నిమిషాలకు భూకంపం వచ్చిందని అన్నారు. దిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీని సంప్రదించినట్లు తెలిపారు. 40 కిలోమీటర్ల లోతులో భూమిలో ప్రకంపనలు వచ్చాయని, ఎక్కువ లోతులో ఉండండంతో తీవ్రత తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఎలాంటి నష్టం జరగలేదన్న అర్వింద్ కుమార్ ప్రకంపనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని తెలిపారు. ములుగు పరిసర జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి పరిస్థితులను ఆరా తీస్తున్నామని అందరినీ అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
సిక్కింలో భూకంపం - రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రత నమోదు