Earthquake in Prakasam District in AP :ఏపీలో భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు రాగా, పోలవరం, శంకరాపురం, ముండ్లమూరు, పసుపుగల్లు, మారెళ్ల, వేంపాడు, తూర్పుకంభంపాడులో భూమి కంపించింది. దీంతో ముండ్లమూరు పాఠశాలలో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు సైతం బయటకు వచ్చారు. తాళ్లూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు రాగా రామభద్రాపురం, తాళ్లూరు, గంగవరం ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు కొద్దిసేపటి వరకు భయాందోళనకు గురయ్యారు.
ఈ నెల 4న తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు : ఈ నెల 4న తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఉదయం 7 గంటల 27 నిమిషాలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన ఆ ప్రాంత ప్రజలు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందని వెల్లడించారు. 55 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సంవత్సరంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ - ఎన్‌జీఆర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి సుమారు 225 కిలో మీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది.