Telangana EAPCET 2025 Applications Postponed :ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. బీటెక్, బీఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్ దరఖాస్తు స్వీకరణ మంగళవారం సాయంత్రం 4.45 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడింది. దరఖాస్తు ప్రక్రియ తిరిగి మార్చి 1 నుంచి ప్రారంభమవుతుందని పరీక్ష కన్వీనర్ డీన్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఏప్రిల్ 29,30 లో అగ్రికల్చర్, మే 2 నుంచి 5 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించిది. వీటికి సంబంధించి ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
సెట్ నిర్వహణకు సంబంధించి జేఎన్‌టీయూలో తొలి సమావేశంలో పరీక్ష సిలబస్ గురించి కూడా చర్చ జరిగింది. ఈ సమావేశానికి విద్యా మండలి ఛైర్మన్, సెట్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్, కన్వీనర్ డీన్ కుమార్ సహా పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎప్‌సెట్ 100శాతం సిలబస్ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల నుంచి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకునేవారు అగ్రికల్చర్ విభాగంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.