Dwaraka Tirumala Rao Retirement as DGP in AP : పోలీస్ ఆఫీసర్గా 35 ఏళ్లు ప్రజలకు సేవ చేసిన తాను సంతృప్తిగా సర్వీసును ముగిస్తున్నందుకు సంతోషంగా ఉందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ మినహా అన్ని రకాల నేరాలు నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో హేట్ పోస్టులను కట్టడి చేయగలిగామని తెలిపారు. చిన్నారులు, మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. ప్రజల్లో పోలీసుల పట్ల మంచి అభిప్రాయం ఏర్పడిందని అన్నారు.
ఆ కేసు ఎక్కువ సంతోషానిచ్చింది : అలాగే రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగామని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది తమ లక్ష్యమన్నారు. ఇప్పటి వరకూ ప్రజల భాగస్వామ్యంతో 28,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వేలి ముద్రల ఆధారంగా నేరాలను గుర్తించి చేధించడంలో దేశంలోనే ఏపీ, తెలంగాణ ముందున్నాయన్నారు.
గంజాయి, డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కొత్తవలసలోని రెల్లి గ్రామంలో గ్రేహౌండ్స్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రికమండేషన్ లేకుండా సామాన్యులకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగిన రోజే నిజమైన పోలీసింగ్ అన్న డీజీపీ ఆరోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సర్వీసులో మారిషస్ వెళ్లి ఎర్రచందనం కేసును ఛేదించడం ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు.