Dussehra Sharannavaratri Mahotsavs in AP:దసరా పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శరన్నవరాత్రుల్లో చివరిరోజైన విజయదశమి పర్వదినాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పలుచోట్ల అమ్మవారికి చేసిన అలంకరణలు ఆకట్టుకున్నాయి. విజయనగరంలో పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీర, సారెతో పాటు ఘటాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ బురుజుపేటలో నెలవైన శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు అభయమిచ్చారు. అమ్మవారిని యాపిల్, దానిమ్మ, బత్తాయి, కమల, ద్రాక్ష ఫలాలతో అలంకరించారు.
రూ.32 లక్షల కరెన్సీతో అలంకరణ: 12వ శక్తిపీఠం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయాలతో పాటు అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసిన పందిళ్లకు వెళ్లి భక్తులు కుంకుమ పూజలు, అర్చనలు నిర్వహించారు. ముమ్మిడివరం ఆర్యవైశ్య సంఘం కల్యాణ మండపంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రూ.32 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. మహిళలు గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారికి సారె సమర్పించారు.
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు - భారీగా తరలి వచ్చిన భక్తులు
డ్రై ఫ్రూట్స్‌తో అలంకరణ: ముమ్మిడివరం నియోజకవర్గంలోని చినకొత్తలంకలో అమ్మవారిని డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించారు. రాయవరం మండలం వెదురుపాకలో విజయదుర్గ అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. కోలాటాలు, శక్తి వేషాలు, తీన్మార్ డప్పులతో గ్రామోత్సవం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు గోస్తనీ తీరాన ఉన్న కనకదుర్గమ్మ రాజరాజేశ్వరిదేవి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. మహిళలు కుంకుమ, గాజులతో ప్రత్యేక పూజలు చేశారు.