Drug smuggling in Telangana : అధికశాతం యువ జనాభా కలిగిన దేశం భారత్. ఆ యువత సక్రమైన మార్గంలో పయనిస్తే దేశార్థికానికి ఎంతో మేలు. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న నేటితరం వారి భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటోంది. ఈ విషయాన్ని గ్రహించి యువతను సరైన మార్గంలో ప్రయాణించేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
Radisson Drug Case Updates : దీనికి సంబంధించి ఏళ్లుగా ఎన్నో కేసులు నమోదవుతున్నా వినియోగదారుల్లో కానీ, వినియోగిస్తున్న వారిలో గాని ఎలాంటి మార్పు ఉండటం లేదు. చాపకింద నీరులా ప్రవహిస్తోన్న మత్తు పదార్థాల వినియోగం ఏ చిన్న పార్టీలోనూ తప్పక ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు(Radisson Drug Case). ఈ నెల 24న మొదలైన పార్టీలో డ్రగ్స్ వినియోగించగా సోమవారం కేసు నమోదైంది. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
హైదరాబాద్‌లోని ఆ హోటల్లో స్నేహితులతో కలిసి ఈ నెల 24న డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశాడు మంజీరా గ్రూప్ డైరెక్టర్ గజ్జల వివేకానంద్. 3గ్రాముల కొకైన్ తెప్పించుకొని హోటళ్లోని 2 గదుల్లో పార్టీ చేసుకున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అర్ధరాత్రి హోటల్‌కు చేరుకోగా వారంతా అక్కడి నుంచి పారిపోయారు. గదుల్లో కొకైన్ ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు వివేకానంద్ ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డ్రగ్స్ తీసుకున్నట్లు వివేకానంద అంగీకరించాడు.
నిజానికి ఈ మత్తు జాడ్యం హైదరాబాద్‌కో, తెలంగాణకే మాత్రమే పరిమితం కాలేదు. రెండ్రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీలోనూ రూ.2000 కోట్ల డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టైంది. ఈ వ్యవహారంలో తమిళనాడు చలనచిత్ర నిర్మాత కీలక సూత్రధారిగా ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు మహారాష్ట్రలోని పుణెలో భారీ స్థాయిలో డ్రగ్స్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది. రూ.1100 కోట్లు విలువ చేసే 600ల కిలోల మెఫ్రెడోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
యువత భవితను చిత్తు చేస్తోన్న మాదకద్రవ్యాలు (Drug smuggling) వివిధ రూపాల్లో మార్కెట్‌లోకి వస్తున్నాయి. హెరాయిన్, కొకైన్, ఎల్‌ఎస్డీ, ఎకస్టసీ పిల్స్, గంజాయి, మత్తు చాక్లెట్లు వీటికి అలవాటు పడి యువత నాశనమవుతోంది. ఒకప్పుడు దేశంలోని ప్రధాన నగరాలకే పరిమితమైన డ్రగ్స్ నేడు గ్రామీణ ప్రాంతాలకూ చేరుతున్నాయి. చిన్నపెద్ద పురుష, మహిళా అనే తేడా లేకుండా అందరూ వీటి బారిన పడుతున్నారు. ఈ విష సంస్కృతికి పాఠశాల విద్యార్థులు సైతం అలవాటుపడుతున్నారు.
క్రమం తప్పకుండా వెలుగు చూస్తోన్న మాదకద్రవ్యాల కేసుల్లో అందర్నీ ఆలోచనలో పడేస్తోన్న విషయం అసలు ఎన్నికేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్టులు చేసినా, ఎంత డ్రగ్స్ పట్టుబడుతున్నా ఇంకా కొత్త కేసులు ఎలా పుట్టుకొస్తున్నాయి?. వీళ్ల వెనక ఉండి నడిపిస్తోన్న అసలు కింగ్‌పిన్స్ ఎవరు? మరి కొందరైతే డబ్బుల కోసం దొంగతనాలు, మోసాలు, అక్రమాలు చేస్తున్న పరిస్థితి తలెత్తింది. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన ఇంకొందరైతే చేసిన తప్పుకు తుడుచుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
TS Govt Focus on Drugs Smuggling : నాణానికి మరోవైపు చూస్తే డ్రగ్స్ సరఫరాను కట్టడి చేయడాన్ని సవాల్‌గా తీసుకున్నామని అంటున్నారు రాష్ట్ర పోలీసులు. గోవా, బెంగళూర్, ముంబయి, దిల్లీ నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాయి ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. దీనిపై నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు మత్తుపదార్థాల సరఫరాదారులను అరెస్ట్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులు అనగానే తరచు వెలుగుచూసే పేర్లు ఆఫ్రికన్లవే.