Drug Gang Attack On police In Hyderabad : హైదరాబాద్‌లోని పలు కాలనీలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. బస్తీల్లోని కొంత మంది దొంగలు, రౌడీలు, గంజాయి ముఠాలకు, డ్రగ్స్ ఏజెంట్లకు రక్షణ కవచంగా తయారయ్యారు. బస్తీల్లో తనిఖీలు చేసేందుకు వెళ్లేందుకు పోలీసులు వెనుకంజ వేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా నగరంలోని నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో మాంగారి బస్తీకి చెందిన ఓ దొంగ పోలీసులపై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. ఆత్మరక్షణకు పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. సైదాబాద్ ఠాణా, బోరబండ ఠాణా పరిధిలోని కొన్ని బస్తీలు రౌడీలకు, బెల్టు దుకాణాలకు కేంద్రమయ్యాయి. పోలీసులు నిర్బంధ తనిఖీలకు వెళితే అక్కడి రౌడీ మూకలు దాడికి దిగుతున్నారు. దీంతో నిందితులు ఆయా కాలనీల్లో నివసిస్తున్నట్లు తెలిసినా అరెస్ట్ చేయడం సవాల్‌గా మారుతోందని నగరానికి చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
ఆ బలహీనతే నేరస్థులకు అస్త్రం: మంగళ్‌హాట్ పరిధిలో 100 కుటుంబాలకుపైగా గంజాయి స్మగ్లింగ్, సట్టాతో పలు ప్రాంతాలను శాసిస్తున్నాయి. షాహినాయత్‌గంజ్, బేగంబజార్‌లలో నకిలీ దందా యథేచ్ఛగా సాగుతుందనేది బహిరంగ రహస్యం. సున్నితమైన ఆ ప్రాంతాల్లో కాలుపెడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే పోలీసుల ముందు చూపు నేరస్థులకు అవకాశంగా మారుతోంది. మత్తు దందాలో నాంపల్లి సమీపంలోని ఆ కాలనీ ప్రధాన కేంద్రం. అక్కడ 20 కుటుంబాలు వ్యాపారం చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలిసినా దాడులు చేసే సాహసం చేయలేక పోయామని ఓ ఇన్‌స్పెక్టర్ వాపోయారు.