Telangana Driving Test :కొందరు డ్రైవింగ్ సరిగా నేర్చుకోకుండానే ఏజెంట్ల ద్వారా అడ్డదారుల్లో లైసెన్సులు పొందుతున్నారు. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. దీని అంతటికీ ఒకటే కారణం. వాహన డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అక్రమాలు చోటు చేసుకోవడమే. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అక్రమాలు నిలువరించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది.
అందులో భాగంగా రాష్ట్రంలో తొలి దశలో 21 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇవి అందుబాటులోకి వచ్చాక డ్రైవింగ్ లైసెన్సుల జారీలో మానవ ప్రమేయం అనేది ఉండదు. పరీక్షకు హాజరైన వ్యక్తికి లైసెన్సు ఇవ్వాలా? వద్దా? అనేది ఆ సాఫ్ట్‌వేరే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మాన్యువల్ విధానంలో డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తున్నారు. ఇందులో మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్లదే కీలక పాత్ర. ఇక ముందు వాటిని ఇచ్చేది టెక్నాలజీనే. అందుకు అనుగుణంగా ఈ ట్రాక్‌లను ప్రభుత్వం సిద్ధం చేయనుంది.
పరీక్ష కోసం వచ్చే వాహనదారుల డ్రైవింగ్‌ను పరిశీలించడానికి ఆ ట్రాక్‌లలో కెమెరాలను బిగిస్తారు. నిర్దేశిత సమయంలో పరీక్ష పూర్తయ్యిందా లేదా రెడ్ సిగ్నల్ దగ్గర ఆగారా లేదా దాటేసి వెళ్లారా? ఇలా ప్రతి ప్రక్రియను కెమెరాల ద్వారా చిత్రీకరిస్తారు. ముఖ్యంగా ట్రాక్‌లో వాహనాన్ని సరిగా నడిపారా? గీత దాటారా? తదితరాలను టెక్నాలజీ ఆధారంగా పక్కాగా నమోదు చేయనున్నారు. డ్రైవింగ్ పరీక్షకు దరఖాస్తుదారే హాజరయ్యాడా లేదా ఇతరులు వచ్చారా అనేది కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా గుర్తిస్తారు.