Drinking Water Action Plan In Mahbubnagar :ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. మిషన్ భగీరథ జూరాల, ఎల్లూరు సెగ్మెంట్ల ద్వారా మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వపనర్తి సహా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 4,500లకు పైగా ఆవాసాలు, 30కి పైగా మున్సిపాలిటీలకు తాగునీరు అందుతోంది. అత్యధిక ఆవాసాలకు నీరందేది ఎల్లూరు సెగ్మెంట్ నుంచే. ఎల్లూరు మిషన్ భగీరథకు శ్రీశైలం వెనక జలాల నుంచి నీళ్లు తీసుకుంటారు.
ప్రస్తుతం శ్రీలైలం జలాశయ నీటిమట్టం 810 అడుగుల వరకూ ఉంది. 800 అడుగుల వరకూ కె.ఎల్.ఐ ద్వారా తాగునీరు(Drinking Water Problem) ఎత్తిపోసుకోవచ్చు. నెలకు 0.80 టీఎంసీల చొప్పున నాలుగు నెలలకు 3.2 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయి. శ్రీశైలం నుంచి 5.68 టీఎంసీల వరకూ నీళ్లు ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉంది. జూరాల, కోయల్ సాగర్ జలాశాయాల్లోనూ తాగునీటికి కావాల్సిన నీటి నిల్వలున్నాయి. జులై వరకూ ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను కలిసి ఎదుర్కోవాలని రైతులకు సీఎం పిలుపు
ఒకవేళ అనుకోని ఇబ్బంది ఏదైనా ఎదురైనా, వేగంగా జలాశయాల్లో నీళ్లు అడుగంటినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించేందుకు ఇప్పటికే సన్నాహలు మొదలు పెట్టారు. గ్రామాల్లో పాత బోరుబావుల్ని పునరుద్ధరించారు. కావాల్సినచోట మరమ్మత్తులు చేయించారు. పనిచేయని మోటార్ల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. చేతి పంపులుంటే వాటిని తిరిగి వినియోగంలోకి తెస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ సర్కారీ బోర్లలో నీళ్లింకిపోతే ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.