తెలంగాణ

telangana

ETV Bharat / state

YUVA : యువతకు చేయూత కల్పిస్తున్న రెడ్డీస్ ల్యాబ్స్​ - ఉచిత శిక్షణలో పాటు ఉద్యోగ అవకాశం - Dr Reddys Free Coaching Youth

Dr.Reddy's Free Coaching Scheme : దేశంలో నిరుద్యోగం కన్నా యువతలో నైపుణ్యాల లేని లోటే ఆందోళన కలిగిస్తుందని నాడు అబ్దుల్‌ కలాం అన్నారు. ఈ మాట అక్షరసత్యం. సరిగ్గా నేడు పీజీ, పీహెచ్​డీ, బీటెక్​, ఎమ్​టెక్​లు చేసినా ఉపాధి కోసం నానాతంటాలు పడుతున్నారు యువత. అందుకు అనేక కారణాలున్నా ప్రధానమైనది నైపుణ్యాలు లేమి. అలాంటి వారికి చేయూతనిస్తోంది ఓ ఫౌండేషన్‌. నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలుస్తూ వారికి ఉచితంగా శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. అసలు ఆ ఫౌండేషన్‌ ఏంటి? ఏ ఏ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు? ఎలా ఉపాధి కల్పిస్తున్నారు? అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 4:30 PM IST

Dr.Reddy's Free Coaching To Youth
Dr.Reddy's Free Coaching To Youth (ETV Bharat)

Dr.Reddy's Free Coaching To Youth :దేశ యువతలో ఉద్యోగ అర్హత 51.25 శాతానికి పెరిగిందని భారత నైపుణ్యాల నివేదిక 2024 వెల్లడించింది. కానీ, పెద్దచదువులు చదివి ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు తెచ్చుకున్నా ఉపాధి కోసం యువత నైపుణ్యాలతో పోరాటం చేస్తూనే ఉందనేది కలవరపెట్టే వాస్తవికత. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచి బతకు బాటలు వేస్తోంది డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్. ఉచిత ఉపాధి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.

ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి వివిధ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది గ్రో టెక్‌. ఇది డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ. ఈ సంస్థలో శిక్షణ పొందాలంటే ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌, బీఎస్సీ, బీసీఏ చేసిన విద్యార్థుల అర్హులు. ఆసక్తి గలవారికి పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా ఎంపిక చేసుకుంటుంది ఈ సంస్థ. ఎంపికైన యువతకు 3 నెలల పాటు శిక్షణ ఇస్తారు.

డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టెక్‌ జాబ్స్‌ ప్రోగ్రాం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో ఫుల్‌స్టాక్‌ డెవెలపర్‌, డేటాసైన్స్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. గ్రీన్‌ జాబ్స్‌ ప్రోగ్రాం ద్వారా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ సర్వీస్‌ టెక్నీషియన్‌ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. ఈ కోర్సులో శిక్షణ పూర్తైన వారికి ఆటోమెటిక్‌ స్కిల్‌ డెవెలెప్‌మెంట్‌ కౌన్సిల్‌ ద్వారా సర్టిఫికెట్‌ లభిస్తుంది. అలాగే సోలార్‌ ప్యానల్‌ ఇన్​ స్టిలేషన్‌ టెక్నీషియన్‌ కోర్సులో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఎన్​ఎస్​డీసీ గ్రీన్‌ కౌన్సిల్‌ ద్వారా సర్టిఫికెట్‌ లభిస్తుంది.

YUVA - చేపలపై యువ పరిశోధకుడి రీసెర్చ్​ - వరల్డ్‌ జర్నల్స్‌లో కథనాలు - Young Man Research on Fishes

శిక్షణ పొంది ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం : సోలార్‌ ప్యానల్‌ ఇనిస్టిలేషన్‌ టెక్నీషియన్‌ కోర్సుకు సంబంధించి హైదరాబాద్‌, అహ్మదాబాద్‌తో పాటు కరీంనగర్‌లో కూడా ఫౌండేషన్‌ ఇనిస్టిట్యూట్లను నిర్వహిస్తోంది. నైపుణ్యాభివృద్ధికి సంబంధించి శిక్షణ కోసం బయట ఇనిస్టిట్యూట్లకు వెళ్తే రూ.40 వేల నుంచి లక్ష రూపాయ వరకు ఖర్చవుతుంది. అదే ఇక్కడ శిక్షణ పొందితే ఆ ఖర్చు లేకుండానే ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయని యువతీయువకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన యువత ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారని ట్రైనర్స్‌ చెబుతున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వారిలో నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఈ ఫౌండేషన్‌ మంచి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందని అంటున్నారు.

"మాకు ఈనాడు పత్రిక ద్వారా డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నారని తెలిసి వచ్చాము. పరీక్ష నిర్వహించారు అందులో ప్రతిభ కనబర్చినవారికి శిక్షణ ఇస్తున్నారు. మేము ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాము. ప్రతి అంశం మాకు పూర్తిగా చెప్తున్నారు. మాక్​ ఇంటర్వ్యూలు కూడా పెడుతున్నారు. బయట ఇవే కోర్సులు నేర్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది." - విద్యార్థులు

సామాజిక సేవలో భాగంగా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద యువత కోసం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఫౌండేషన్‌ సీఈవో ప్రణవ్‌కుమార్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 100కి పైగా కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని అంటున్నారు. 18 నుంచి 28 ఏళ్లలోపున్న పేద, మధ్యతరగతి నిరుద్యోగ యువతకు ఇదో చక్కటి అవకాశమని, ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వారు చెబుతున్నారు. ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ వెలుగు బాటలు వేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశంతో నైపుణ్యాలు మెరుగుపరుచుకుని తమని తాము నిరూపించుకుంటామని ధీమాగా చెబుతున్నారు ఈ యువత.

YUVA : పేదరికం వెంటాడుతున్నా తగ్గలేదు - పార్ట్​టైం జాబ్ చేస్తూ తెలుగు కబడ్డీ లీగ్​కు ఎంపికైన నల్గొండ వాసి - Kabaddi Player Ajay From Yadadri

YUVA : షూటింగ్‌లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు - జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు కైవసం - Rifle Pistol Shooters Sucess Story

ABOUT THE AUTHOR

...view details