DR Ranga Reddy Burri on HMPV Virus : కోవిడ్ తర్వాత వైరస్ పేరు చెబితే చాలు వణికిపోతున్న పరిస్థితి. ఎక్కడ ఇన్ఫెక్షన్ సోకుతుందో అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపీవీ (హ్యుమన్ మెటా న్యూమో వైరస్) వైరస్ భారతీయులను ఆందోళనకు గురి చేస్తోంది. కర్ణాటకలో రెండు కేసులు వెలుగుచూసిన క్రమంలో మరింత భయం కలిగిస్తోంది.
అయితే వాస్తవానికి హెచ్ఎంపీవీ అంత ప్రమాదకరం కాదని గతంలోనూ భారత్లో ఈ తరహా కేసులు నమోదవుతూనే ఉన్నాయంటున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో అసలు హెచ్ఎంపీవీ ప్రమాదకరమా? ఈ వైరస్ లక్షణాలు ఏమిటి? అనే అంశాలను ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ బుర్రి రంగారెడ్డి ఈటీవీ భారత్కు వివరించారు.
"హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తది కాదు. ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఏవైతే కథనాలు వస్తున్నాయో అవన్నీ అసంబద్ధమైనవి. ఇది వరకే భారత్లో ఈ కేసులు ఉన్నాయి. దీనిపై కేంద్రప్రభుత్వం స్టేట్మెంట్ కూడా చూడవచ్చు. ఇది ఒక సీజనల్ ఎఫెక్ట్ మాత్రమే. దీంతో ఎలాంటి ప్రమాదం లేదు. దీనిని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. చైనాలో వచ్చిందనగానే అందరూ భయపడుతున్నారు అంతే. ఐదేళ్ల క్రితం వచ్చిన కొవిడ్ మళ్లీ రాబోతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదు" -డాక్టర్ బుర్రి రంగారెడ్డి, ఐఎఫ్సీఏఐ ప్రెసిడెంట్