Dos And Don'ts of Toothbrush Storage :హలో. మీ పళ్లను తోమే టూత్‌బ్రష్‌ను శుభ్రం చేస్తున్నారా? క్యాప్‌ను ఉపయోగిస్తున్నారా? గాలి, వెలుతురులో ఉంచుతున్నారా? లాంటి ప్రాథమిక అంశాలను నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తలెత్తుతాయి. నిత్య జీవితంలో భాగమైన టూత్ బ్రష్‌ల వినియోగంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పళ్ల ఆరోగ్య సంరక్షణ తీరును సిద్దిపేటలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు తమ పరిశోధన ద్వారా స్పష్టం చేశారు. ఆ వివరాలు మీ కోసం.
'టూత్ బ్రష్‌ల ద్వారా బ్యాక్టీరియాల వ్యాప్తి' అంశంపై మైక్రో బయాలజీ(సూక్ష్మజీవ), బయో టెక్నాలజీ(జీవసాంకేతిక శాస్త్రం)ల సంయుక్త ఆధ్వర్యంలో మొదటి ఏడాది, తృతీయ సంవత్సరాలకు చెందిన 6 విద్యార్థులు పరిశోధించారు. సూక్ష్మ జీవశాస్త్ర హెచ్‌వోడీ డా. జి.మదన్‌మోహన్ పర్యవేక్షణలో 45 రోజులు పాటు అధ్యయనం సాగింది. ఇందులో భాగంగా 100 మంది విద్యార్థులు, అధ్యాపకుల టూత్‌బ్రష్‌ల శాంపిల్స్‌ను స్వాబ్ పద్ధతిలో సేకరించారు. వాటిపై ఉండేటువంటి బ్యాక్టీరియాలతో వ్యాధులు వ్యాప్తి చెందుతాయా? అనే కోణంలో పరిశోధించారు.
ఫలితాల గుర్తింపు ఇలా :ఈ అధ్యయనంలో భాగంగా అందరి బ్రష్‌లలో బ్యాక్టీరియాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా 3 రకాలు ఎక్కువగా ఉన్నట్లుగా తేల్చారు. 50 శాతం నమూనాల్లో స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్, 40 శాతం నమూనాల్లో స్టెఫైలో కోకస్ ఆర్యస్, 20 శాతం శాంపిల్స్‌లో ఎస్‌రేషియా కోలి బ్యాక్టీరియాలు ఉన్నట్లుగా వెల్లడైంది.
ఎందుకిలా :టూత్ బ్రష్‌లను బాత్‌రూం, సింకుల వద్ద ఉంచడం వల్ల ఆయా బ్యాక్టీరియాలు వాటిని ఆశ్రయిస్తాయి. బ్రష్‌లను ఒకే చోట పెట్టినా ప్రమాదమే. ఆవటి పళ్ల (బ్రిసిల్స్)కు క్యాప్ వంటి రక్షణ లేకపోవడమూ ప్రమాదమే అని అధ్యయనంలో వెల్లడైంది.
సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదగాలంటే దంతాలను జాగ్రత్తగా చూసుకోవాలి. దంత క్షయంతో ఇబ్బంది పడే వారి సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. ప్రాథమిక అంశాలపై అందరూ అవగాహన పెంచుకోవాలి. టూత్ బ్రష్‌ను కచ్చితంగా 3 నెలలకోసారి మార్చాలి. బ్రష్ శుభ్రం చేసే విధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి - డా. అరవింద్‌కుమార్, దంత వైద్యుడు, సిద్దిపేట