Stray Dog Attack Cases Rising In Nalgonda :కుక్కలు అంటే విశ్వాస జంతువులంటాం. ఇంటిని, మనల్ని రక్షిస్తాయని భావిస్తాం. కానీ ఆ కుక్కలే మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి. రక్తానికి మరిగినట్లుగా మనుషులపై దాడి చేసి కరుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీధి కుక్కల స్వైరవిహారం ఆగడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక వీధిలో, ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో, లక్షా 10 వేలకు పైగా వీధి కుక్కలు,10 వేలకు పైగా పెంపుడు కుక్కలు ఉన్నాయి. పిచ్చి కుక్కలు వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులతో పాటు జంతువులపైన దాడులు చేస్తున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కనిపించిన వారిని పీక్కుతింటున్నాయి. రోజుకు 10 నుంచి 20 మంది గాయపడుతూనే ఉన్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
నల్గొండలో ఇంటివద్ద ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడి చెంపను గాయపరచటంతో చర్మం ఊడిపోయంది. సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. నకిరేకల్, మునుగోడులో రెండు రోజుల వ్యవధిలో కుక్కల దాడుల్లో 18 మంది గాయపడ్డారు. వీరు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు తీసుకున్నారు. వీధుల్లో కాలినడకన వెళ్లే వారిని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని వెంటపడి కిందపడేస్తూ గాయపరుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డేంజర్ డాగ్స్ - ఆడుకుంటున్న బాలుడిపై అటాక్ - తల పీక్కుతిన్న కుక్కలు - SECUNDERABAD BOY DIED IN DOG ATTACK
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై కుక్కలు దాడిచేశాయి. ఈ దాడిలో ఆమె కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. మోత్కూరులో బైకుపై వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది. కుక్కలు కరుస్తాయన్న భయంతో వ్యక్తి వాహనం స్పీడు పెంచడంతో అదుపుతప్పి వాహనంపై నుంచి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడి నుంచి ఎలాగైనా తప్పించుకునేందుకు పెద్దలు యత్నిస్తున్నారు.. కానీ చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. కుక్కలు కాటు వల్ల రేబిస్ వ్యాధి సోకుతుందేమోనని బాధితులు భయాందోళనకు గురవుతున్నారు.
కుక్కకాటు వేసిన వెంటనే సమీప ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోకపోతే, గాయపడిన బాధితులకు వారంలోపు జ్వరం, తలనొప్పి, చికాకు పడటం, హైడ్రోఫోబియా వంటి లక్షణాలు కనిపిస్తాయని.. శరీరంలో నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్‌కు గురై చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ఇతర ఆస్పత్రుల్లో 24 గంటలపాటు టీకాలను అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లాలో ఎక్కడా వ్యాక్సిన్ల కొరత లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మూడేళ్ల చిన్నారిపై కుక్కల దాడి - సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు - Dogs Attack on Three Years Boy